ఉత్సాహంగా టిడిపి ఆఫీస్‌లో బతుకమ్మ వేడుకలు

ప్రభుత్వం పట్టించుకోవట్లేదు.. హరీష్
బతుకమ్మ పండుగను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీశ్ రావు విమర్శించారు. బతుకమ్మ పండుగను సర్కారు ఏనాడూ పట్టించుకోలేదని, చివరికి రాష్ట్ర పండుగ అనేది కూడా ప్రకటనకే పరిమితమైందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రాంతానికే చెందిన డికె అరుణ సమాచార శాఖ మంత్రిగా ఉన్నా.. బతుకమ్మ పండుగ ప్రాశస్త్యాన్ని చెబుతూ ఒక్క కార్యక్రమం కూడా చేపట్టడం లేదని హరీశ్ రావు ఆరోపించారు.
తెలంగాణలో ప్రకృతి పండుగ బతుకమ్మతో నిజమైన జీవ వైవిధ్యం జరుగుతుంటే పట్టించుకోవటంలేదు. బతుకమ్మ పండుగ నిర్వహణకు ప్రభుత్వం జిల్లాకో రూ.10 కోట్లు కేటాయించాలి అని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే తమ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పిన సిగ్నల్స్ నిజమేనని అర్థమవుతోందని ఆయన అన్నారు.
అయితే తెలంగాణ ఏర్పాటు ఇప్పుడా.. ఎప్పుడా అనే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణపై కేంద్రం వైఖరి తెలిశాక పార్టీలో చర్చిస్తామని, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితితో మాట్లాడుతామని, రెండు, మూడు రోజులు మేధోమథనం సాగించి ఏం చేయాలో నిర్ణయిస్తామని చెప్పారు.తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications