అమ్మ అప్పుడే చెప్పారు, రహస్యంగా ఉంచా: సర్వే

తనకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో మీడియా చానెళ్ల తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రాజకీయంగా సోనియా పునర్జన్మ ఇచ్చారని చెప్పారు. జనరల్ సీటు తనకు ఇచ్చి గెలిపించారని ఆయన చెప్పారు. పది రోజుల క్రితం తాను సోనియాను కలిశానని, మంత్రి పదవి ఇస్తున్నట్లు సోనియా అప్పుడే చెప్పారని, అయితే రహస్యంగా ఉంచాలని సూచించారని, తన భార్యకు మాత్రమే చెబుతానని చెప్పానని, అందుకు సోనియా అంగీకరించారని, సోనియా చేసిన సూచన వల్లనే తనకు మంత్రి పదవి లభించే విషయాన్ని రహస్యంగా ఉంచానని ఆయన వివరించారు.
ఇచ్చిన మాటను సోనియా తప్పరని ఆయన అన్నారు. సర్వేకు చివరి నిమిషంలో మంత్రి పదవి ఖరారైందని, సర్వే కుంగిపోయారని, ఆనందంతో ఉన్నారని రకరకాలుగా మీడియాలో వార్తలు వచ్చాయని ఆయన అన్నారు. ఈ స్థితిలో సంతోషకరమైన వార్తను చెప్పడానికి మీడియా సమావేశం పెట్టినట్లు తెలిపారు. అమ్మగారి దయాదాక్షిణ్యాలతో తాను రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని ఆయన అన్నారు. తనకు ఏ శాఖ ఇస్తారో తెలియదని చెప్పారు.
మంత్రి పదవితో తన బాధ్యత పెరిగిందని, తెలంగాణకు మాత్రమే తాను పరిమితం కాదని, రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాల్సి ఉందని, సోనియా నాయకత్వాన్ని బలపరిచేలా ప్రజలను సమాయత్తం చేయాల్సి ఉందని, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాల్సి ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై మాట్లాడకపోవడం వల్లనే మంత్రి పదవి దక్కుతోందనే వాదనను ఆయన ఖండించారు. తెలంగాణ అంశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఉందని, యుపిఎ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో ఉందని, రాష్ట్రపతి ప్రసంగంలో ఉందని, ఆ మేరకు 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ప్రక్రియ ప్రారంభమవుతున్నట్లు కేంద్ర ప్రకటించిందని ఆయన వివరించారు.
తెలంగాణపై తానే ధైర్యంగా మాట్లాడానని, ఇచ్చిన హామీ మేరకు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తారని సర్వే అన్నారు. తెలంగాణపై చర్చ ముగిసిపోలేదని అధిష్టానం పెద్దలు చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఇవ్వడానికి పరిస్థితులు సహకరించడం లేదని, తెలంగాణ కావాలనుకునేవారికి ఓపిక ఉండాలని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తారని, రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెసు ప్రభుత్వాలు ఉంటాయని అన్నారు. అమ్మ తెలంగాణ ఇస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications