జయప్రద ఏ పార్టీలో చేరుతారు, మోహన్ బాబు బాటేనా?

ఆమె మాటలను తరిచి చూస్తే మాత్రం ఖచ్చితంగా 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే పోటీ చేస్తుందనే విషయం అర్థమవుతోంది. దీంతో ఆమె ఏ పార్టీలో చేరుతారనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జయప్రదకు తెలుగులో అభిమానులు చాలా మంది ఉన్నారు. దీంతో ఆమె ఏ పార్టీలో చేరుతుంది, లాభం ఎంత నష్టం ఎంత అనే అంశంపై ఇప్పటి నుండే లెక్కలు వేసుకుంటున్నారట. అయితే సినీ స్టార్‌లను చూసి ఓట్లు వేసే కాలం పోయిందని మరికొంతమంది పెదవి విరుస్తున్నారు.
ఏ పార్టీలో చేరాలనే దానిపై జయప్రద తన సన్నిహితులు, రాజకీయ మిత్రులతో చర్చిస్తున్నారట. ఏదేమైనా జయప్రద రాజకీయ ఆరంగేట్రం మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైనట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల వైపు దృష్టి సారించిన తర్వాత ఆమె పలు సందర్భాలలో చేసిన వ్యాఖ్యలను తరిచి చూస్తున్న వారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
అంతేకాకుండా ఆమె గతంలో టిడిపితోనే రాజకీయ ఆరంగేట్రం చేసింది. చంద్రబాబుతో చిన్న చిన్న విభేదాల కారణంగా ఆమె ఆ పార్టీని విడిచిపెట్టింది. ఎనిమిది నెలల క్రితం తిరుపతి వచ్చినప్పుడు ఆమె మాట్లాడుతూ... బాబు పాలనపై ప్రశంసలు కురిపించడంతో పాటు, టిడిపికి దూరంగా ఉన్నంత మాత్రాన ఆయనను వ్యతిరేకించినట్లు కాదని చెప్పారు. తనకు బాలకృష్ణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు.
అమె 2014 ఎన్నికల్లో రాష్ట్రం నుండే ప్రాతినిథ్యం వహించాలని భావిస్తే ఖచ్చితంగా టిడిపిలోనే చేరతారనే చర్చ సాగుతోంది. అయితే గతంలో టిడిపిలో పని చేసిన మోహన్ బాబు ఇటీవలి వరకు చంద్రబాబుకు అనుకూలంగా ఉండి ఒక్కసారిగా ప్లేటు పిరాయించారని.. అలాగే జయప్రద కూడా ఆయన దారిలోనే నడిచే అవకాశాలు కూడా పూర్తిగా కొట్టిపారేయలేమని అంటున్నారు. మోహన్ బాబు టిడిపికి దూరమైన చాలా రోజుల తర్వాత నెలల క్రితం బాబును తన విద్యాసంస్థల వార్షికోత్సవానికి ఆహ్వానించారు.
బాబుకు అనుకూలంగా మాట్లాడారు. కానీ ఇటీవల ఆయన వైఖరిని గమనిస్తున్న వారు అతను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మోహన్ బాబు ఇప్పటి వరకు తాను ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని ప్రకటించనప్పటికీ.. జైలులో ఉన్న జగన్‌ను కలిసి ఆయన అరెస్టును ఖండించారు. జగన్ బయటకు వస్తాడని, దేవుడు ఉన్నాయని వ్యాఖ్యానించారు. మోహన్ బాబు దాదాపు జగన్ వైపు వెళ్లినట్లేనని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications