కిరణ్‌కు దూరంగా... జగన్‌తో మజ్లిస్ దోస్తీ? స్కెచ్చేశారా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మజ్లిస్(ఎంఐఎం) పార్టీ దగ్గరవుతుందా అంటే అవుననే అంటున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో స్పష్టంగా ఆ విషయాన్ని తెలిపారని అంటున్నారు. చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయం విషయమై మజ్లిస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తన స్నేహానికి చెక్ పడిందని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం పరోక్షంగా చెప్పారు. నిన్నటి వరకు తన స్నేహితుడు కిరణ్ అని ఇప్పుడు జగన్ అని ఆయన చెప్పడం గమనార్హం.

రాష్ట్రపతి ఎన్నికల సమయంలో యూపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయాలని జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన అసదుద్దీన్ ఇప్పుడు ఆయన వైపు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. జైలులో కలిసినప్పటి నుండే అటువైపు అడుగులు పడి ఉంటాయంటున్నారు.

మొదటి నుండి కాంగ్రెసు పార్టీకి అండగా ఉన్నప్పటికీ 2004లో వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మజ్లిస్‌కు పార్టీతో కంటే ఆయనతో అనుబంధం పెరిగిందనే చెప్పవచ్చు. అదే అభిమానం వైయస్ తనయుడు జగన్ పైన మజ్లిస్ అధినేతకు ఉండి ఉంటుందని అంటున్నారు. అయితే కాంగ్రెసుకు వదులుకోవాలో జగన్‌కు మద్దతివ్వాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో తాజాగా కాంగ్రెసుకు గుడ్ బై కొట్టేందుకు అవకాశం దొరకడంతో మజ్లిస్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అదే సమయంలో జగన్ తమకు కొత్త మిత్రుడు అని చెప్పారని అంటున్నారు.

మజ్లిస్ పార్టీ కాంగ్రెసుకు గుడ్ బై చెప్పడంతో ముస్లిం మైనార్టీ వర్గాలు కాంగ్రెసుకు దూరం కానున్నారా అనే చర్చ వచ్చింది. అయితే కాంగ్రెసు పార్టీ మాత్రం ఆ వాదనలను కొట్టి పారేస్తుంది. కానీ నిన్నటి వరకు క్రిస్టియన్ వర్గాలను దరి చేర్చుకున్న జగన్ తాజాగా మజ్లిస్ అండతో ముస్లిం వర్గాలను కూడా తమ వైపుకు ఆకర్షించుకునే యత్నాలు ప్రారంభించారని అంటున్నారు. అయితే స్థానిక ఇష్యూ నేపథ్యంలో కాంగ్రెసుకు ముస్లిం వర్గాలు దూరం కాబోవనేది మరికొందరి వాదన.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాలనలోనూ, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారన్న అసదుద్దీన్ ఓవైసీ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలు మాత్రం ఇబ్బందులు వచ్చినట్లుగా చెప్పలేదు. జగన్ పార్టీకి మద్దతిచ్చే ఉద్దేశ్యంలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు.
భేటీ అనంతరం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ తాము కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి, యూపిఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారు. అదే సమయంలో ఆయన తనకు కిరణ్ కుమార్ రెడ్డి పాత స్నేహితుడు అని, జగన్ కొత్త స్నేహితుడని చెప్పారు. ఈ వ్యాఖ్యలను తరచి చూస్తే ఆయన జగన్ వైపుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు.
అంతేకాకుండా ఆయన తన విలేకరుల సమావేశంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తమకు అన్యాయం జరిగినట్లుగా చెప్పలేదు. 1998 నుండి తాము కాంగ్రెసు పార్టీకి మద్దతుగా నిలిచామని.. బిజెపితో టిడిపి అంటకాగినందుకే తాము కాంగ్రెసుతో ఉన్నామన్నారు. టిడిపి హయాంలో ముస్లింలను వేధించారని, తనపై కూడా దాడి జరిగిందన్నారు. ఆ తర్వాత 2004 నుండి 2009 అంటే వైయస్ పాలనపై అసదుద్దీన్ ఎలాంటి విమర్శలు చేయలేదు.
టిడిపి పాలనను విమర్శించిన తర్వాత ఆయన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. టిడిపి హయాంలో ముస్లింలు ఇబ్బందులు పడ్డారని చెబుతూ.. గత మూడేళ్లుగా 2010 నుండి ముస్లింలు నష్ట పోతున్నారన్నారు. రోశయ్య హయాంలో జరిగిన మత ఘర్షణల్లో ముస్లింలు నష్ట పోయారని చెబుతూ.. కిరణ్ హయాంలో కూడా ముస్లింలు నష్టపోతున్నారని, దీనిని కిరణ్ దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ ఆయన స్పందించటం లేదన్నారు.
కాగా ఎంఐఎం కాంగ్రెసుకు మద్దతు ఉపసంహరించడం వెనుక ఎవరైనా పావులు కదిపారా అనే చర్చ రాజకీయా వర్గాల్లో జోరుగా కొనసాగుతోంది. కాంగ్రెసు, టిడిపి పార్టీల ఎమ్మెల్యేలను వరుసగా తమ వైపుకు ఆకర్షిస్తున్న జగన్... మజ్లిస్‌పై కూడా ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించారా అనే చర్చ సాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో జైలులో ఉన్న జగన్‌ను కలిసి యూపిఏకు మద్దతివ్వాల్సిందిగా అసదుద్దీన్ కోరారు.
నాటి చర్చల తర్వాత నుండి అసదుద్దీన్ క్రమంగా జగన్ వైపుకు మొగ్గు చూపి ఉంటారంటున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో తమ పార్టీ పట్టు పెంచుకునేందుకు కూడా మజ్లిస్ కాంగ్రెసుతో తెగతెంపులు చేసుకొని ఉంటుందంటున్నారు. కాంగ్రెసుతో ఇంతకాలం కలిసి ఉన్న మజ్లిస్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలపేతం చేయాలని చూస్తోంది.
కేవలం పాతబస్తీకే పరిమితం అయిన మజ్లిస్‌కు కాంగ్రెసు రాష్ట్రవ్యాప్తంగా చేయూతనిచ్చే పరిస్థితి లేకపోవచ్చునని, అదే సమయంలో కొత్తగా పుట్టిన జగన్ పార్టీ వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని, ఆ దిశలో ఆలోచించే మజ్లిస్ మద్దతు ఉపసంహరణ నిర్ణయం తీసుకొని ఉండి ఉంటుందంటున్నారు. కాంగ్రెసుకు ఎంఐఎం మద్దతు ఉపసంహరించడంతో కాంగ్రెసుకు ముస్లింలు మద్దతును కొనసాగిస్తారా లేదా ఉపసంహరిస్తారా అనే చర్చకు కూడా తెరలేచింది.












Click it and Unblock the Notifications