ఒక్కడినే: కిరణ్ కుమార్ మొండిగా దూసుకెళ్తున్నారా?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాను చెప్పినట్లుగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా? అలా ధైర్యం చేసి నిర్ణయాలు తీసుకొని వివాదాస్పదమవుతున్నారా? అంటే అవుననే అంటున్నారు. నవంబర్ 14న రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన బాలల దినోత్సవంలో కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని, భయపడుతూ పనులు చేయకూడదని, భయపడి పని చేసే బతుకు బతుకే కాదన్నారు.

ముఖ్యమంత్రి తీరుపై మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి తొలి నుండి అసంతృప్తితో ఉన్నారు. కిరణ్ మంత్రివర్గ విస్తరణ జరిగిన సమయంలో వారి మధ్య సత్సంబంధాలు ఉండేవి. రూపాయికి కిలో బియ్యంపై డిఎల్ విమర్శలు గుప్పించడంతో ప్రారంభమైన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. డిఎల్‌ను మంత్రివర్గం నుండి తొలగించేందుకు కిరణ్ చేయని ప్రయత్నాలు లేవు. అయితే డిఎల్ శాఖలో కోత కోసి సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత నుండి డిఎల్ ముఖ్యమంత్రి పట్ల మరింత గుర్రుగా ఉన్నారు. అవసరమైనప్పుడు చెలరేగుతున్నారు. రూపాయికి కిలో బియ్యం కిరణ్ ఎవరికీ చెప్పకుండా తీసుకున్న నిర్ణయమనే విమర్శలు ఉన్నాయి. సంబంధింత మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కూడా తెలియదట. దీనిపై ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆనం సోదరులతోనూ కిరణ్‌కు తొలుత మంచి సంబంధాలే ఉండేవి. ఆ తర్వాత విభేదాలు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఎంత వరకు వచ్చిందంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆనం సోదరుల హవాకు చెక్ చెప్పేందుకు ఆయన మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవిని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మికి కట్టబెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ ఆనం సోదరులు దీనికి చెక్ చెప్పడం వేరే విషయం.

కిరణ్ పేరు చెబితే చాలు అంతెత్తు లేస్తాడు మాజీ మంత్రి శంకర రావు. ఆయన కిరణ్‌తో వైరం వల్లనే తన మంత్రి పదవిని పోగొట్టుకున్నాడు. చేనేతకు మంత్రిగా తాను ఉన్నప్పటికీ కిరణ్ తన శాఖలో వేలు పెడుతున్నారని శంకర రావు మంత్రిగా ఉన్న సమయంలో ఆరోపించారు. అధికారులను కూడా తన మాట వినవద్దని కిరణ్ ఆదేశించారని, ఆయన నిర్ణయాలనే అమలుపర్చే వారని విమర్శించారు.

ఇందిర బాట కార్యక్రమంపై సొంత పార్టీ నేతలు పెదవి విరిచారు. కానీ ఆయన మాత్రం తనదైన శైలిలో ఈ కార్యక్రమం పేరుతో జిల్లాలు చుట్టి వస్తున్నారు.

రాజీవ్ యువకిరణాలు పథకం కూడా వివాదాస్పదమైంది. ఈ పథకం కింద మూడేళ్లలో పదిహేను లక్షల ఉద్యోగాలు ఇస్తామని కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇది కూడా కిరణ్ సొంత నిర్ణయమే అన్న విమర్శలు ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో మంత్రులు ఆయనకు మద్దతుగా నిలబడుతున్నారట. సాధ్యం కాని పథకం అంటూ తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

మజ్లిస్ వ్యవహారంలోనూ కిరణ్ దూకుడుగానే వ్యవహరించారని అంటున్నారు. మిగిలిన నేతలు, పార్టీ అధిష్టానం మజ్లిస్‌ను చల్లబర్చేందుకు ప్రయత్నాలు చేయగా.. కిరణ్ మాత్రం ఆ దిశలో ప్రయత్నాలు చేయలేదట. అయితే ఈ విషయంలో మాత్రం పార్టీ నేతల మద్దతు కిరణ్‌కు సంపూర్ణంగా లభించింది. అయితే అధిష్టానం మాత్రం దీనిపై అసంతృప్తితో ఉంది. ఈ విషయంలో మాత్రం కిరణ్ తీరును సమర్థిస్తూ అధిష్టానానికి నేతలు నచ్చజెబుతున్నారట.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలోనూ కిరణ్ తన శైలిలోనే వెళ్లారని అంటుంటారు. జగన్ పైన మిగిలిన నేతలు విమర్శలు చేసినప్పుడు కిరణ్ సైలెంట్‌గా ఉండేవారు. కిరణ్ వ్యతిరేక వర్గం జగన్‌ను ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించినా ఆయన సమాధానం చెప్పేవారు కాదు. కానీ పలు సందర్భంగాలలో మిగిలిన నేతల కంటే జగన్ పైన కిరణ్ విరుచుకుపడ్డ సందర్భాలు ఉన్నాయి.
దీంతో కిరణ్ వ్యాఖ్యలపై అటు కాంగ్రెసులో ఇటు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మంత్రివర్గంలోనే మంత్రులే ఆయనపై తమ అసంతృప్తులు ప్రకటించిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఎవరికీ ఎదురు కాని అనుభవాలు కిరణ్‌కు ఎదురయ్యాయని చెప్పవచ్చు. అంతేకాకుండా సొంత పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల నుండే ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రాంత ఎంపీలైతే ఆయనపై నిత్యం మండిపడుతున్నారు.
మజ్లిస్ పార్టీ వ్యవహారంతో కిరణ్ ధోరణి ఢిల్లీ స్థాయిలో మరోసారి ప్రధానంగా చర్చనీయాంశమైంది. పార్టీలోని అసంతృప్త నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం, అసమ్మతి గళం వినిపించడం ఇవన్నీ సాధారణంగా నడుస్తున్నవే. కానీ మజ్లిస్ వ్యవహారం మాత్రం ఢిల్లీ నేతలనే కదిలించిందని చెప్పవచ్చు. మజ్లిస్ వ్యవహారంతో కిరణ్ పట్ల కాంగ్రెసు పార్టీ అధిష్టానం అసంతృప్తి తారాస్థాయికి చేరుకుందని అంటున్నారు.
కిరణ్ నిర్ణయాల పట్ల పలువురు పెదవి విరుస్తున్నప్పటికీ ఆయన మాత్రం తాను అనుకున్న బాటలోనే వెళ్తానని పలుమార్లు చెప్పారు. తాను ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నానని, అదే చేస్తానని, ఎవరో అన్నంత మాత్రాన తాను చేసే మంచి పనిని మధ్యలో ఆపే ప్రసక్తి లేదంటారు. మజ్లిస్ వ్యవహారంలో కూడా ఆయన ఎవరికీ భయపడేది లేదని, భయపడి పని చేసే బతుకు బతుకే కాదన్నారు.












Click it and Unblock the Notifications