అసదుద్దీన్‌కు రాహుల్ ఫోన్: కిరణ్ తీరుపై సమీక్ష?

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి, అటు యుపిఏ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడంతో తలెత్తిన పరిస్థితిపై కాంగ్రెస్ అధినాయకత్వం బుధవారం అత్యున్నత స్థాయిలో సమీక్ష జరిపింది. ఎంఐఎం రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నా యుపిఏ ప్రభుత్వానికి మద్దతు కొనసాగించేలా చూసేందుకే రాహుల్ గాంధీ ఒవైసీతో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కిరణ్‌కుమార్ రెడ్డితో ఏర్పడిన విభేదాల మూలంగా ఒవైసీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేందుకు ఆమోదించి కేంద్రంలోని యుపిఏ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు కొనసాగించేలా చూసుకునేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒవైసీ జాతీయ స్థాయిలో ముస్లిం మైనారిటీల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో సఫలమైతే ముందు, ముందు తమకు రాజకీయ పరంగా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలోచిస్తున్నారు.
కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవటంపై కాంగ్రెస్ అధినాయకత్వం అత్యున్నత స్థాయిలో సమీక్షా సమావేశం జరిపింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ అధ్యక్షతన బుధవారం రాత్రి దాదాపు గంట పాటు జరిగిన ఈ సమీక్షా సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం, కేంద్ర మంత్రులు,రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, ప్రత్యేక పరిశీలకుడు వయలార్ రవి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హాజరయ్యారు. గులాం నబీ ఆజాద్ త్వరలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయి.
ఎంఐఎం అధ్యక్షుడు ఒవైసీ ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ ముస్లిం రాజకీయ పార్టీలతో జాతీయ స్థాయిలో ఒక కూటమిని ఏర్పాటు చేసేందుకు జరుపుతున్న ప్రయత్నాలను ఈ సమావేశంలో సమీక్షించారు. ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోకుండా చూడటంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నాలు, కృషి ఏమిటనేది కూడా వారు పరిశీలించినట్లు తెలిసింది.
అసెంబ్లీ ఎన్నికల నాటికి ఒవైసీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో సీట్ల సర్దుబాటు చేసుకుంటారని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. మద్దతు ఉపసంహరించుకోవాలని ఒవైసీ గత నాలుగైదు నెలల నుండి ఆలోచిస్తున్నా కిరణ్ కుమార్ రెడ్డి దీన్ని ముందే పసిగట్టి తగు నివారణ చర్యలను ఎందుకు తీసుకోలేకపోయారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించిన ఈ నాయకులు ఒకటి, రెండు రోజుల్లో సోనియా గాంధీకి వివరిస్తారు. దీని తరువాతే పార్టీ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications