బాల్ థాకరేపై వ్యాఖ్య, అమ్మాయిల అరెస్ట్: సరైనదేనా?

దీనిపై శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడం... వారిద్దరిని పోలీసులు అరెస్టు చేయడం... వారికి బెయిల్ లభించడం తెలిసిన విషయమే. దీనిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. మన దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, థాకరేపై వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయడమేమిటని కొన్ని సంఘాలు, పార్టీలు ప్రశ్నించాయి. అరెస్టు చేయడమంటే భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమే అని కొందరు విమర్శిస్తున్నారు.
అయితే విమర్శకులకు ఎక్కువ మంది ధీటైన సమాధానమే ఇస్తున్నారు. భారత దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నదనేది ఎవరూ కాదనలేని నిజమని అయితే ఇతరుల మనసులు నొప్పించే భావ ప్రకటన సరికాదనే విషయాన్ని విమర్శలు చేస్తున్న వారు గుర్తించాలని చెబుతున్నారు. మరికొందరు అమ్మాయిల అరెస్టును తప్పుపడుతున్నప్పటికీ థాకరేపై వారి వ్యాఖ్యలను మాత్రం సమర్థించడం లేదు. అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని చెబుతున్నారు.
భావ ప్రకటన అంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం కాదంటున్నారు. అలాంటి భావ ప్రకటనే అయితే ఏ సినిమాను బ్యాన్ చేయాల్సిన అవసరం లేదని, ఏ పార్టీని టార్గెట్‌గా పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. తమను కించపరుస్తున్నారంటూ కూడా ఎవరూ ముందుకు రాకూడదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే సామాజిక వెబ్ సైట్లు వెలుగులోకి వచ్చాక ఇలాంటివి పరిపాటిగా మారాయని, అరెస్టు చేయాల్సినంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదనేది మరికొందరి వాదన.
ఓ ముఖ్యనేత మృతి చెందిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని, ముంబై నగరం మొత్తం శోకసముద్రంలో ఉండగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. కార్యకర్తలు, అభిమానులు విచారంగా ఉన్న సమయంలో వారి మనసులను మరింత నొప్పిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా తప్పే అంటున్నారు. వేదనతో ఉన్న మనసులను మరింత గాయపరిస్తే వారిలో ఆవేశం పెల్లుబుకడంలో అర్థముందంటున్నారు.
ముఖ్యమైన వారు మృతి చెందినప్పుడు వారి ప్రత్యర్థులు కూడా వారి గురించి పొగడ్తలతో ముంచెత్తుతారని, ప్రజాస్వామ్యయుతంగా పార్టీని నడిపిన శివసేన అధినేత థాకరేపై మృతి చెందిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలేమిటని ప్రశ్నిస్తున్నారు. సాధారణ సమయంలో ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినా అభ్యంతరం ఉండేది కాదంటున్నారు. కాగా థాకరే మృతిపై షహీన్ దాఢా మంగళవారం క్షమాపణలు చెప్పారు. తనకు థాకరే అంటే అభిమానమని, ఆయన గొప్ప దేశభక్తుడు అని, క్యాజువల్‌గా కామెంట్ చేశానన్నారు. కానీ ఎవరి మనసులు నొప్పించాలని కాదని చెప్పారు.












Click it and Unblock the Notifications