చెప్తే చెల్లిస్తా, ఎన్నికల్లో పోటీ చేయాలి: బెయిల్‌కోసం గాలి

ఓఎంసి కేసులో సిబిఐ చెబుతున్నట్లు ప్రభుత్వ ఖజానాకు నష్టం ఏమైనా వాటిల్లినట్లు తేలితే ఆ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించడానికి తాను సిద్ధంగా ఉన్నానని గాలి చెప్పారు. మరో ఐదు నెలల్లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు. బెయిల్ కోరుతూ గాలి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై నాంపల్లి సిబిఐ కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి.
తన న్యాయవాది విజయసేన్ రెడ్డి ద్వారా గాలి తరఫున వాదనలు వినిపించారు. తాను అరెస్టు అయ్యే ముందు వరకు మంత్రినని, ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్నానని, ప్రజా ప్రతినిధిగా తాను కర్ణాటక ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉందని చెప్పారు. ఖజానాకు నష్టం వాటిల్లిందని సిబిఐ ఆరోపిస్తోందని, ఇది నిరూపణ అయితే చెల్లిస్తానని స్పష్టం చేశారు. ఓఎంసి కేసులో గాలికి మైనింగ్ లీజు ఇవ్వడంలో అక్రమాలు జరిగాయని సిబిఐ ఆరోపించిందని, అదే నిజమని భావించినా ఆ కేసులో శ్రీలక్ష్మిని, రాజగోపాల్‌ను మాత్రమే అరెస్టు చేయడం ఏం న్యాయమని డిఫెన్స్ న్యాయవాది ప్రశ్నించారు.
ఓఎంసికి లీజు మంజూరు చేయడంలో ఆయా శాఖల అధికారులు చాలా మంది ఫైల్స్ చూస్తారని అన్నారు. వారిని అరెస్టు చేయాలని తాము అడగడం లేదని, అయితే సిబిఐ దర్యాప్తు ఎలా సాగుతుందనే విషయాన్ని చెప్పేందుకే దీనిని కోర్టు దృష్టికి తెస్తున్నామన్నారు. వాస్తవాల్ని పరిశీలించి నిందితుడికి బెయిల్ ఇవ్వాలని కోరారు. సిబిఐ న్యాయవాది వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో న్యాయమూర్తి బెయిల్ కేసు విచారణను గురువారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications