చంద్రబాబు వస్తున్నా మీకోసం: 'దమ్ము' కోసం 'బాద్‌షా'?

అయితే నందమూరి కుటుంబ సభ్యులు అందరూ పాదయాత్రలో కనిపిస్తున్నప్పటికీ జూనియర్ కనిపించక పోవడంతో ఆ ఒక్కరు ఎక్కడా అనే ప్రశ్న తలెత్తింది. దీనిని పటాపంచలు చేస్తూ జూనియర్ టిడిపికి మరోసారి మద్దతు పలికారు. బాబు పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు. బాబు పాదయాత్ర ప్రారంభించిన సమయంలోనే అతను మహబూబ్ నగర్ జిల్లాకు పాదయాత్ర చేరినప్పుడే పాల్గొంటారనే ప్రచారం జోరుగా జరిగింది.
అయితే అది జరగలేదు. దీంతో పలువురిలో అనుమానాలు తలెత్తినా జూనియర్ ప్రకటనతో తొలగిపోయాయి. అప్పుడు ఎలాంటి ప్రకటన రాకపోవడం కేవలం ఊహాగానాలు చెలరేగటంతో మాత్రమే జూనియర్ పాలమూరు యాత్రలో పాల్గొనలేదని... ఇప్పుడు మీడియా సమక్షంలో ప్రకటన చేశారు. కాబట్టి పాదయాత్ర పూర్తయ్యేలోగా ఖచ్చితంగా పాల్గొంటారని చెబుతున్నారు. అయితే అది ఎప్పుడు అనేది అందరినీ తొలుస్తున్న ప్రశ్న.
బాద్‌షా చిత్రం పూర్తయిన తర్వాత తాను పాదయాత్రలో పాల్గొంటానని జూనియర్ చెప్పారు. జూనియర్ బాద్‌షా విడుదలకు కొద్ది రోజుల ముందు బాబుతో కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బాద్‌షా చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 11న విడుదల కానుంది. ఆ సినిమా విడుదల సమయంలో జూనియర్ పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. దమ్ము విడుదలయిన సమయంలో జూనియర్ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
ఆ సినిమా విడుదలయిన సమయంలోనే గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని, విజయవాడ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ ఉదంతాలు జరిగాయి. వల్లభనేని వెనక్కి తగ్గినా నాని మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిపోయారు. నాని వెనుక తాను ఉన్నాననే విమర్శలు రావడంతో జూనియర్ బయటకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ ప్రభావం దమ్ము సినిమా కలెక్షన్ల పైనా ప్రభావం చూపినట్లుగా వార్తలు వచ్చాయి.
దీంతో జూనియర్ తగ్గారనే వాదనలు వినిపించాయి. అయితే టిడిపికి జూనియర్ ఎంత అవసరమో జూనియర్ సినీ జీవితానికి టిడిపి కూడా అంతే అవసరమనే వాదన ఉంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దమ్ము సినిమాతో కలిగిన నష్టాన్ని బాద్‌షా సినిమాతో పూడ్చుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నారని అంటున్నారు. అందుకు బాద్‌షా చిత్రం విడుదలయే మంచి సందర్భంగా భావిస్తుండవచ్చునని అంటున్నారు. విడుదల సమయంలో బాబు పాదయాత్రలో పాల్గొనడం ద్వారా నష్టాన్ని పూడ్చుకోవాలనే భావనలో ఉండి ఉంటారని, అందుకే అదే సమయంలో పాదయాత్రలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.












Click it and Unblock the Notifications