ప్రియాంక గాంధీ, బృందాకారత్ అవయవదానం
న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయ ప్రియాంకా గాంధీ వాద్రా అవయవ దానానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఓ ఆసుపత్రి వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి నిర్వాహకులు అవయవదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రియాంక గాంధీ మరణానంతరం తన అవయవాలను దానం చేస్తున్నట్లు తెలిపారు.

అయితే ఆమె స్వయంగా రాలేదు. సంక్షిప్త సందేశం(ఎస్సెమ్మెస్) రూపంలో ఆమె ఆసుపత్రి వర్గాలకు పంపారు. అవయవదాతల జాబితాలో తన పేరును కూడా చేర్చాలని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. ఈ సంకల్పానికి ఉపయోగపడుతుందని భావిస్తే తన పేరును కూడా అవయవదాతల పేర్ల జాబితాలో చేర్చాలని, తన పేరును ప్రకటించవచ్చునని, ఈ కార్యక్రమంలో స్వయంగా హాజరవ్వాలని భావించానని, కానీ కుదర లేదని సందేశంలో పేర్కొన్నారు.
ప్రియాంక వాద్రా గాంధీ తన ఇద్దరు పిల్లలకు ఇదే ఆసుపత్రిలో జన్మనిచ్చారు. సిపిఎం(కమ్యూనిస్టు పార్టీ-మార్క్సిస్ట్) నాయకురాలు బృందాకారత్ కూడా అవయవదానానికి ముందుకు వచ్చారు. అవయవదాన సంకల్పానికి తాను పూర్తిగా మద్దతిస్తున్నానని ఆమె చెప్పారు. తాను కూడా అవయవదానం చేస్తానని ఆసుపత్రి వర్గాలకు బృందాకారత్ చెప్పారు. ఈ అవయవదాన ప్రతినలో సుమారు 500 మంది ప్రతినబూనారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications