హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై ఒకే ప్రతినిధి: చంద్రబాబు వ్యూహం?

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana-Chandrababu Naidu
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీని ఇరకాటంలో పెట్టడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహం పన్నినట్లే కనిపిస్తున్నారు. తెలంగాణ అంశంపై ఆయన కాంగ్రెసు పార్టీని చిక్కుల్లో పడేయడానికి పూనుకున్నారు. ఈ నెల 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీ నుంచి ఒకే ప్రతినిధిని పంపించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణపై తన నిర్ణయాన్ని ప్రకటించే దిశగా కాంగ్రెసును నెట్టాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీది, కేంద్ర ప్రభుత్వానిదీ అని ఆయన పదే పదే చెబుతున్నారు. పైగా, తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని గట్టిగానే చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పుకోవడానికి కూడా ప్రస్తుత వ్యూహం పనికి వస్తుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణపై కేంద్రం నిర్వహించే సమావేశానికి ఒకే ప్రతినిధిని పంపుతామని సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు చెప్పారు. అదే మాట తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు కూడా చెప్పారు. అంటే, ఒకే ప్రతినిధిని పంపించాలని పార్టీపరంగా నిర్ణయం తీసుకున్నట్లే భావించవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటనను అమలు చేయాలని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. తెలంగాణపై కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేదని, అందుకే జాప్యం చేస్తోందని ఆయన విమర్శించారు.

ఒకే ప్రతినిధిని అఖిలపక్ష సమావేశానికి పంపుతామని చెప్పిన తెలుగుదేశం నాయకులు తెలంగాణపై పార్టీ వైఖరిని మాత్రం వెల్లడించలేదు. తమ వైఖరిని అఖిల పక్ష సమావేశంలో వెల్లడిస్తామని చంద్రబాబు చెప్పారు. అఖిల పక్ష సమావేశంలో తమ పార్టీ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని నామా నాగేశ్వర రావు అన్నారు. ఆ వైఖరి ఏమిటనేది తేలడం లేదు. తమ నిర్ణయంపై ఎందరు పార్టీని వీడినా నష్టం లేదని యనమల రామకృష్ణుడు అన్నారు.

తాము తెలంగాణకు వ్యతిరేకం కాదనే చంద్రబాబు మాటలకు యనమల రామకృష్ణుడి తాజా మాటలకు ఏమైనా పొంతన ఉందా అనేది ఆలోచించాల్సిన విషయం. ఆ రెండింటిని కలిపి చూస్తే తెలుగుదేశం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చెప్పే అవకాశాలున్నాయని భావించవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ అంత సులభంగా తేలుస్తుందని చెప్పలేం. ముందుగా కాంగ్రెసు వైఖరి వెల్లడించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఎటూ తేల్చకుండా అఖిల పక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు. అది ఎలా అనేది తేలడం లేదు. ప్రస్తుతానికి మాత్రం చంద్రబాబు తన వ్యూహం ద్వారా కాంగ్రెసును అయోమయంలోనికి నెట్టదలుచుకున్నట్లు అర్థమవుతోంది.

English summary
According to political analysts - Telugudesam party president N Chandrababu Naidu in bid to create trouble to ruling congress party on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X