IPL 2026: ఫాఫం ఢిల్లీ.. అక్కడే మ్యాచ్ ఖతమ్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఘోర పరాజయం ఎదురైంది. సోమవారం న్యూఢిల్లీ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 9 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది.
81 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకోవడంతో ఆర్‌సీబీ రన్‌రేట్ రెట్టింపు అయ్యింది. ఐపీఎల్ చరిత్రలోనే ఆర్‌సీబీకి ఇది రెండో అతిపెద్ద విజయం కాగా ఢిల్లీకి ఘోర పరాజయం.
నిప్పులు చెరిగిన భువీ, హేజిల్‌వుడ్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్(33 బంతుల్లో 3 ఫోర్లతో 30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డేవిడ్ మిల్లర్(19), కైల్ జెమీసన్(12)తో సహా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సాహిల్ పరఖ్(0), కేఎల్ రాహుల్(1), నితీష్ రాణా(1), సమీర్ రిజ్వీ(0), ట్రిస్టన్ స్టబ్స్(5), అక్షర్ పటేల్(0) తీవ్రంగా నిరాశపర్చారు.

అర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/5), జోష్ హేజిల్‌వుడ్(4/12) ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించగా.. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ, రసిక్‌ధార్ సలామ్ తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్‌సీబీ 6.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 23 నాటౌట్), దేవదత్ పడిక్కల్(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) అజేయంగా నిలవగా.. జాకోబ్ బెతెల్(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20) దూకుడుగా ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో కైల్ జెమీసన్(1/42) ఒక్కడే ఒక వికెట్ తీసాడు.
పవర్ ప్లేలోనే మ్యాచ్ ఖతమ్..
పవర్ ప్లేలోనే ఢిల్లీ ఓటమి ఖాయమైంది. భువనేశ్వర్ కుమార్ స్వింగ్, హజెల్ వుడ్ లైన్ అండ్ లెంగ్త్‌కు ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేసారు. పవర్ ప్లేలోనే 6 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఢిల్లీ బ్యాటర్లలో కైల్ జెమీసన్ మినహా మరే బ్యాటర్ సిక్సర్ బాదలేదు. దీన్ని బట్టే ఆ జట్టు బ్యాటింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పిచ్ మరీ బౌలింగ్‌కు అనుకూలంగా లేకపోయినా.. ఢిల్లీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్వింగ్ బౌలింగ్ ఆడలేక ఓటమికి తల వంచారు. పవర్ ప్లేలోనే అత్యల్ప స్కోర్(13/6) నమోదు చేసిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ చెత్త రికార్డును మూటగట్టుకుంది.












Click it and Unblock the Notifications