6 నెలల్లో జగన్ సిఎం: షర్మిల, పాదాల చెంత నివాళులు

బుధవారం తన పాదయాత్రలో షర్మిల మాట్లాడుతూ... తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో ఆరు నెలల్లో ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. జగన్ సిఎం అయ్యాక పేద ప్రజల సమస్యలను తీర్చుతారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏళ్లు గడుస్తున్నా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదని ఆరోపించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయాక ప్రజల కన్నీళ్లు, కష్టాలు పట్టించుకునే వారే లేకుండా పోయారన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం పెట్టకుండా వస్తున్నా మీకోసం పాదయాత్ర పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. బాబు ఇప్పుడు చేస్తున్న వాగ్ధానాలను వైయస్సార్ ఎప్పుడో చేసి చూపించారన్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా... నక్క జిత్తుల మాటలతో ప్రజలను బాబు నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
కిరణ్ కుమార్ రెడ్డి యువకిరణాల కింద ఉద్యోగాలు అంటున్నారని, కానీ ఎవరికి ఆ ఉద్యోగాలు వస్తున్నాయో తెలియడం లేదన్నారు. కాగా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో షర్మిల పాదయాత్ర సందర్భంగా దివంగత వైయస్ విగ్రహానికి పూలమాల వేయడానికి స్థానిక నాయకులు ఇబ్బందులు పడ్డారు. ఇది గమనించిన షర్మిల వారి నుండి దండను తీసుకొని వైయస్ విగ్రహం పాదాల చెంత ఉంచి నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications