వారు రోడ్డెక్కడమా: ఎన్టీఆర్ అసలు వారసులెవరు!?
హైదరాబాద్: తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి చాటి చెప్పి... తెలుగుదనాన్ని ప్రపంచానికి తెలియజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం విషయంలో ఆయన కుటుంబ సభ్యులు రోడ్డుకెక్కడాన్ని ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎన్టీఆర్ వారసులు అయినంత మాత్రాన, ఆ ఫ్యామిలీకి చెందిన వారయినంత మాత్రాన ఆయన విగ్రహం కోసం ఇంతగా రోడ్డున పడాలా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
శ్రీరాముడు, శ్రీకృష్ణుడుగా అఖిలాంధ్ర ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్‌ను అక్కున చేర్చుకున్నది ఆంధ్ర ప్రజలే కానీ కుటుంబ సభ్యులు కాదంటున్నారు. ఎన్టీఆర్‌ను రచ్చకీడ్చడం తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు, హీరో బాలకృష్ణకు, కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరికి, అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వర రావుకు, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణకు సరికాదంటున్నారు.
ఎన్టీఆర్ రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన ఆయనను తమ తమ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకోవడం వారి వారసులకు సరికాదంటున్నారు. పార్లమెంటులో విగ్రహం విషయంలో వారసులు తమ రాజకీయ లబ్ధి కోసం పోటీ పడితే ఎన్టీఆర్ అభిమానులే ఆ విగ్రహాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ధ్వజమెత్తుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకుంటున్న వారి చరిత్ర ఏది తవ్వినా ఆయనకు వెన్నుపోటు పొడిచిన వారే అంటున్నారు.

ఎన్టీఆర్ విగ్రహం అంశంలో ఆయన వారసులు తమ తమ రాజకీయ లబ్ధి కోసం వివాదంలోకి లాగడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. పురంధేశ్వరి, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, హరికృష్ణలు పోటా పోటీ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పడుతున్నారు.

కుటుంబ సభ్యులు ఎవరూ ఎన్టీఆర్‌కు వారసులు కారని, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఎన్టీఆర్‌ను అక్కున చేర్చుకున్న అఖిలాంధ్ర అభిమానులే ఆయన వారసులు, అని ఆయనను బజారుకీడ్చడం సరికాదంటున్నారు.

పార్టీ పరంగా, కుటుంబపరంగా వారసులమని చెప్పుకుంటున్న వారంతా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారేనని, అవి ఆ కుటుంబ సభ్యుల వ్యాఖ్యల ద్వారానే అర్థమవుతోందంటున్నారు.

విగ్రహం విషయంలో చంద్రబాబుకు మద్దతు పలికేందుకు బాలకృష్ణ తన సోదరి పురంధేశ్వరిపై ఘాటైన వ్యాఖ్యలను ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. హరికృష్ణ కూడా చంద్రబాబుపై అసంతృప్తితో పార్టీకి, అల్లుళ్లకు సంబంధం లేదనడాన్ని తప్పు పడుతున్నారు.

ఎన్టీఆర్ పదవీచ్యుతుడు కావడానికి కారణమైన వారిలో దగ్గుపాటి దంపతులు కూడా ఉన్నారని, అలాంటి వారు ఇప్పుడు తమ తమ రాజకీయాల కోసం ఆయనను ఉపయోగించుకుంటున్నారని మండిపడుతున్నారు. ఎన్టీఆర్ ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా టిడిపిని స్థాపించారో అదే కాంగ్రెసులోకి వెళ్లిన పురంధేశ్వరి మాట్లాడటం ఏమిటంటున్నారు.

లక్ష్మీ పార్వతి మొదటి నుండి ఎన్టీఆర్‌తో లబ్ధి పొందాలని చూస్తున్నారని, ఎన్టీఆర్‌ను వ్యతిరేకించిన దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేరుతో ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీకి మద్దతు పలకడమే కాకుండా వైయస్, ఎన్టీఆర్‌లను పోల్చుతున్న లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటున్నారు.
ఆ విషయాన్ని కుటుంబ సభ్యులలోని వారు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న విమర్శల ద్వారానే స్పష్టమవుతోందని చెబుతున్నారు. కారణమేమైనా ఎన్టీఆర్ పదవీచ్యుడై మనోవేధనకు గురి కావడానికి అందరూ కారణమేనని అంటున్నారు. పురంధేశ్వరి, దగ్గుపాటి, హరికృష్ణ, బాలకృష్ణ, చంద్రబాబు, లక్ష్మీ పార్వతిలు అందరూ ఎవరికి వారు తమ లబ్ధి కోసం ఎన్టీఆర్‌ను ఉపయోగించుకోవడమే కాకుండా ఇప్పుడు ఆయన పేరును రోడ్డున పడేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్‌ను రాముడిగా, కృష్ణుడిగా అభిమానించి ఆదరించిన తెలుగు ప్రజల సొత్తు అని, వారసుల సొత్తు మాత్రం కాదంటున్నారు. రాజకీయ నాయకుడిగా ఆయనకు తిరుగులేని ఆధిపత్యాన్ని ఇచ్చిన తెలుగు తమ్ముళ్లు, అక్కా చెల్లెల్ల సొత్తు కానీ తనయులు, తనయలు, భార్య, అల్లుళ్ల సొత్తు కాదని సూచిస్తున్నారు. వారు రాజకీయ ప్రయోజనాల కోణంలో ఆలోచిస్తున్నారే కానీ ఎన్టీఆర్ పట్ల అభిమానంతో ఆలోచించినట్లుగా కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications