వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్బరుద్దీన్ హేట్ స్పీచ్: చిక్కుల్లో వైయస్ జగన్ పార్టీ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan j- Akbaruddin Owaisi
హైదరాబాద్: మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ విద్వేషపూరిత ప్రసంగంతో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చిక్కుల్లో పడినట్లే కనిపిస్తోంది. అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ప్రతి రాజకీయ పార్టీ ఖండిస్తుండగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం మౌన పాత్ర పోషిస్తోంది. అక్బరుద్దీన్‌పై చట్టపరమైన చర్యలకు పోలీసులు చర్యలు చేపట్టారు. వివిధ కోర్టుల నుంచి అక్బరుద్దీన్‌కు నోటీసులు వెళ్లాయి. ఈ స్థితిలో అక్బరుద్దీన్ వ్యాఖ్యల విషయంలో ఏం మాట్లాడాలో తెలియని అయోమయ స్థితిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పడినట్లే కనిపిస్తోంది.

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మౌనం వహించడంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కడిగిపారేశారు. వైయస్సార్ కాంగ్రెసును మతపరమైన పార్టీగా ఆయన అభివర్ణించారు. పనిలో పనిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చేతిలో బైబిల్ పట్టుకుని రాజకీయ ప్రసంగాలు చేయడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మజ్లీస్‌తో దోస్తీ కట్టి మైనారిటీ ఓట్లను రాబట్టుకోవాలని ఆశిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రస్తుత పరిణామం గొడ్డలి పెట్టు వంటిదే.

కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకుని వైయస్ జగన్‌కు మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ దగ్గరయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుని ఏడు శానససభా స్థానాలను గెలుచుకున్న మజ్లీస్ ఇప్పుడు మరిన్ని సీట్లపై కన్నేసినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ వెలుపల కూడా తన ఉనికిని చాటుకోవడానికి అది ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో అక్బరుద్దీన్ ఓవైసీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు పరిణామాలను ఊహించే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారా, అనాలోచితంగా ఉద్రేకంలో చేశారా అనేది తెలియడం లేదు. కానీ రాజకీయ ప్రయోజనం ఆశించి, ఓ వర్గం ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు ఆ వ్యాఖ్యలు చేశారనేది మాత్రం స్పష్టం.

వైయస్ జగన్ దోస్తీని ఆసరా తీసుకుని రాయలసీమలోని అనంతపురం, కర్నూలు వంటి జిల్లాల్లో పాగా వేయాలని మజ్లీస్ భావించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణలో మజ్లీస్ సహాయంతో నెట్టుకు రావాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో మజ్లీస్ సహకారంతో కొన్ని సీట్లను గెలుచుకోవచ్చునని వైయస్సార్ కాంగ్రెసు ఎత్తుగడగా కనిపిస్తోంది. తెలంగాణవాదం నుంచి ఓ వర్గాన్ని దూరం చేయడానికి కూడా అక్బరుద్దీన్ తన ప్రసంగాన్ని ఉద్దేశించి ఉంటారని అంటున్నారు.

మజ్లీస్‌తో వైయస్సార్ కాంగ్రెసు అక్బరుద్దీన్ వ్యాఖ్యల తర్వాత కూడా కొనసాగిస్తుందా, తెగదెంపులు చేసుకుంటుందా అనేది తేలడం లేదు. అయితే, అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై వ్యూహాత్మక మౌనాన్ని పాటించడం ద్వారా కొంత కాలం ఆగాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కొంత కాలం గడిస్తే అక్బరుద్దీన్ వ్యాఖ్యల దుమారం సమసిపోవచ్చునని, అప్పుడు దోస్తీని తెరపైకి తెస్తే ప్రమాదం ఉండదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈలోగా, అక్బరుద్దీన్ వ్యాఖ్యలను సమర్థించే పని గానీ వ్యతిరేకించే పని గానీ చేయకూడదని అనుకుంటోంది. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఈ వైఖరిపై దుమ్మెత్తిపోయడానికి ప్రత్యర్థులు సిద్ధంగా ఉన్నారు. పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.

English summary
According to political analysts - YS Jagan's YSR Congress party is silent as a strategy on MIM MLA Akbaruddin Owaisi's hate speech. Silence of YSRCP was questioned by Telugudesam pary leader Somireddy Chandramohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X