భారత్ కు బ్యాడ్ న్యూస్: పెట్రోల్, గ్యాస్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం..??
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల్ని వణికిస్తున్నాయి. ముడి చమురు, గ్యాస్, విద్యుత్ సంక్షోభంతో అల్లాడుతున్నాయి. అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో ఈ దారుణమైన పరిస్థితులు తలెత్తాయి. ప్రపంచదేశాలతోపాటు భారత్ కు కీలకమైన సముద్ర రవాణా మార్గం ఇదే. ఇక భారత్ చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో 60 నుంచి 65 శాతం వరకు చమురు హార్మూజ్ జలసంధి ద్వారానే మన దేశానికి చేరుతుంది. ఈ వాణిజ్య మార్గం మూసివేసిన నేపథ్యంలో భారత్ లో పెట్రోల్, డీజిల్ సంక్షోభం తలెత్తింది.
అందువల్లనే ఇటీవల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది కేంద్ర ప్రభుత్వం. లీటర్ పై రూ. 3 వరకు పెంచింది. అయితే తాజాగా భారత్ కు మరో షాక్ తగిలింది. రష్యాలోని రియాజాన్ ప్రాంతంలో ఉన్న భారీ చమురు శుద్ధి కార్మాగారంపై ఉక్రెయిన్ తాజాగా దాడులకు పాల్పడింది. ఈ దాడి కారణంగా అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు. అయితే ఈ రిఫైనరీ ఏటా దాదాపు 17 మిలియన్ టన్నుల ముడి చమురును ప్రాసెస్ చేస్తుంది. ఈ దాడితో రష్యా చమురు ఉత్పత్తి, సరఫరాకు మరింత ఆటంకం కలిగే ప్రమాదం ఏర్పడింది.
మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా తాజా ఆంక్షలు విధించింది. గతంలో ఇచ్చిన తాత్కాలిక మినహాయింపును పొడిగించకూడదని నిర్ణయించింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ మినహాయింపును రెండు సార్లు పొడిగించినప్పటికీ ఈ సారి దానిని నిలిపివేయడంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ఒత్తిడి ఏర్పడింది. హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా సరఫరా కొరత ఏర్పడుతుందనే భయంతో ఈ మినహాయింపును పొడిగించాలని భారత్, ఇండోనేషియా లాంటి దేశాలు విజ్ఞప్తి చేసినప్పటికీ అమెరికా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక ఇప్పటికే హార్మూజ్ లో ఉద్రిక్తతలు అలాగే ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే భారత్ లోనూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలపైనా ప్రభావం పడే ప్రమాదం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications