షాంపులతో పాలు, ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం షాకింగ్ నిజాలు!
మనం రోజూ తాగే పాలు ఎంతవరకు సురక్షితం? అమృతం లాంటి పాలను కొందరు స్వార్థపరులు విషతుల్యంగా మారుస్తున్నారు. మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే పాల కల్తీకి సంబంధించి అత్యంత షాకింగ్ వివరాలను వెల్లడించారు. మార్కెట్‌లో అమ్ముడవుతున్న పాలలో ప్రమాదకరమైన సింథటిక్ రసాయనాలు కలుపుతున్నారని, ఇది ప్రజ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారిందని ఆయన హెచ్చరించారు.
ఇటీవల జరిపిన తనిఖీల్లో వెలుగుచూసిన విషయాలు విని అధికారులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కొందరు కేటుగాళ్లు ఎలాంటి పాలు లేకుండానే కేవలం రసాయనాలతో 'ఆర్టిఫిషియల్ పాలను' తయారు చేస్తున్నారని కమిషనర్ తుకారాం స్పష్టం చేశారు. వెన్న తీసేసిన పాలపొడితో పాటు విషపూరితమైన కాస్టిక్ సోడా, డిటర్జెంట్లు, షాంపూ లు, రకరకాల ప్రమాదకర రసాయనాలను నీటిలో కలిపి తెల్లటి రంగు, చిక్కదనం వచ్చేలా సింథటిక్ పాలను సృష్టిస్తున్నారు.

అసలైన పాలలో రసాయనాల మిక్సింగ్!
ఈ విధంగా తయారుచేసిన కృత్రిమ పాలను నేరుగా కాకుండా, పాడి రైతులు, డైరీల నుంచి సేకరించిన అసలైన పాలలో నిర్దిష్ట నిష్పత్తిలో కలుపుతున్నారు. దీనివల్ల సాధారణ తనిఖీల్లో పాల చిక్కదనం, ఫ్యాట్ పరిమాణం సరిగ్గా ఉన్నట్లే కనిపిస్తాయి. అయితే, లోతుగా పరిశీలిస్తే తప్ప అందులో ఉన్న ప్రాణాంతక రసాయనాలు బయటపడటం లేదు. లాభాల కోసం వ్యాపారులు ఆడుతున్న ఈ విషక్రీడ సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతోంది.
అవయవాలు దెబ్బతినే ప్రమాదం.. డాక్టర్ల తీవ్ర ఆందోళన!
ఇలాంటి రసాయన పాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల మానవ శరీరంపై తీవ్ర దుష్ప్రభావాలు పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలలో కలిపే కాస్టిక్ సోడా, డిటర్జెంట్లు జీర్ణక్రియను నాశనం చేయడమే కాకుండా, కాలేయం, కిడ్నీలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ పాలను తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, అవయవ వైఫల్యం, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తుకారాం ముండే ఆందోళన వ్యక్తం చేశారు.
కల్తీ రాయుళ్లపై కఠిన చర్యలు.. ఎఫ్‌డీఏ హెచ్చరిక!
ఇలాంటి ప్రాణాంతక కల్తీకి పాల్పడే వారిపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని ఎఫ్‌డీఏ కమిషనర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాల సేకరణ కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లపై నిఘా తీవ్రం చేశామన్నారు. ప్రజలు కూడా పాలు కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే ఎఫ్‌డీఏ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.














Click it and Unblock the Notifications