సోనియాను టార్గెట్ చేసిన కావూరి: కెసిఆర్‌పై ఫైర్

తెలంగాణ ఉద్యమం వ్యాపారంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. నాయకులకు పదవులు ఉంటే వేర్పాటువాదం మూల పడుతుందని, లేకుంటే ప్రత్యేక తెలంగాణ తెరపైకి వస్తుందని విమర్శించారు. ఈ ఉద్యమాల ముసుగులో నాయకులు కోట్ల రూపాయలు మూటగట్టుకుంటున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్ర విద్యార్థి, యువజన, మహిళా, ఉద్యోగ సంఘాల, దళిత, గిరిజన జేఏసీలు సంయుక్తంగా బుధవారం విశాఖపట్నంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ సదస్సును నిర్వహించాయి. ఈ సదస్సులో కావూరి సాంబశివ రావు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పదవిలో ఉన్నప్పుడు తెలంగాణ గురించి మాట్లాడలేదని, ఇప్పుడు విద్యార్థులను ఉసిగొల్పి ఉద్యమాలు చేయించడం వెనుక ఆంతర్యం ఆయనకే తెలుసునని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ చెందిన లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన రాష్ట్ర రాజధానిని వదిలిపోవాలని కేసీఆర్ సీమాంధ్రులకు హుకుం జారీ చేస్తారా అని, అది ఆయనబ్బ జాగీరా అని కావూరి అడిగారు. లక్షల మంది సమైక్యవాదులతో హైదరాబాద్‌లో బహిరంగ సభ పెట్టగలం గానీ వివాదం ఎందుకని ఊరుకుంటున్నామని అన్నారు.
సమైక్యాంధ్ర సిద్ధాంతం పునాదులపైనే తమ తెలుగుదేశం ఆవిర్భవించిందని ఆ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం అన్నారు. తమ పార్టీ అధిష్ఠానం కేంద్ర హోం మంత్రి షిండేకు ఇచ్చిన లేఖ తెలంగాణకు అనుకూలమా? ప్రతికూలమా? అనేది తనకు అనవసరమని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి సమైక్యాంధ్రనే కోరుకుంటున్నానని ఆయన అన్నారు.
తెలంగాణ జిల్లాల్లో సమైక్య వాదులు ఎక్కువగా ఉన్నారని, వారందరి మనోభావాలను గౌరవించేందుకు ఈ నెల మూడో వారంలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆడారి కిషోర్‌కుమార్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications