గల్లా చంద్రగిరిపై నారాలోకేష్ ఆసక్తి: తమ్ముళ్ల పోటాపోటీ!

లోకేష్ ఇన్నాళ్లూ హెరిటేజ్ కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షించారు. తన సతీమణి నారా బ్రాహ్మిణి విదేశాల నుండి రావడంతో ఆ బాధ్యతలను ఆమెకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. త్వరలో లోకేష్ పార్టీ పైన పూర్తిస్థాయిలో పట్టు సాధించనున్నారు. ఆలోగా బ్రాహ్మిణిపై హెరిటేజ్ బాధ్యతలను పెట్టనున్నారు. సంక్రాంతికి వెళ్లిన లోకేష్ జిల్లాలో పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. ఏ నియోజకవర్గంలో ఎంత బలముంది? పార్టీని ఎలా బలోపేతం చేయాలనే అంశంపై వారితో చర్చించారు.
ఈ సమయంలో ఆయన ప్రత్యేకంగా చంద్రగిరి నియోజకవర్గంపై దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గం నుండి గతంలో లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు ప్రాతనిథ్యం వహించారు. 1978లో కాంగ్రెసు పార్టీ తరఫున బాబు గెలుపొందారు. ఆ తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో బాబు కాంగ్రెసును వీడి ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత బాబు కుప్పంకు మారారు.
ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా మంత్రి గల్లా అరుణ కుమారి ఉన్నారు. ఈ రోజు జరిగిన సమీక్షా సమావేశంలో పలువురు చంద్రగిరి తెలుగు తమ్ముళ్లు నారా లోకేష్‌ను నియోజకవర్గ ఇంచార్జిగా ఉండాలని ఒత్తిడి తీసుకు వచ్చారట. అయితే మరికొందరు నేతలు మాత్రం లోకేష్ వంటి నేత ఆరంగేట్రం సమయంలోనే ఓ నియోజకవర్గానికి, ఓ జిల్లాకు పరిమితం కాకుండా ఉంటే మంచిదని సూచించారట. అయితే లోకేష్ మాత్రం ఆ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చుతున్నారనే కామెంట్ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications