మీ రాజీనామాలే ఉత్తుత్తివి: కెకెపై మంత్రి గంటా ఫైర్

సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నవారితో ఆయన బుధవారం సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సీమాంధ్ర నేతల సమావేశాన్ని అడ్డుకుంటామని తెలంగాణ నాయకులు చేసిన హెచ్చరికలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. భావ ప్రకటనా స్వేచ్ఛ తమకూ ఉందని, దాన్ని హరించాలని ప్రయత్నించడం అప్రజాస్వామికమని అన్నారు.
కాంగ్రెసు అధిష్టానాన్ని తాను ధిక్కరిస్తున్నట్లు కేశవరావు మాట్లాడుతున్నారని, తెలంగాణ నాయకులే ధిక్కారానికి పాల్పడుతున్నారని గంటా అన్నారు. ఒక్క సమావేశానికే తెలంగాణ నాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని అంటూ వారు చేసినదానికి సీమాంధ్ర నాయకులు ఎంత చేయాలని ఆయన అడిగారు. విశాఖపట్నంలో ఈ నెల 20వ తేదీన శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు ఐదు జిల్లాల సమైక్యాంధ్ర సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సమైక్యాంధ్రను కోరుకునే మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరవుతారని ఆయన చెప్పారు. కేంద్రం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయిస్తే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు రాజీనామాలకు సిద్ధపడాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications