లగడపాటి బయటకొచ్చె!: హైడ్రామా, కళ్లముందు 2009
విజయవాడ/నల్గొండ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిసేందుకు ప్రయత్నిస్తున్న విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అనుమంచిపల్లెలోని ఓ పార్టీ నేత ఇంట్లో బస చేశారు. బాబును కలవకుండా, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు లగడపాటిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు ఉదయం చేపట్టారు. అందుకోసం లగడపాటి ఉన్న ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
లగడపాటి మాత్రం ఇంట్లోంచి బయటకు రాలేదు. ఇంటిలోపల గడియ పెట్టుకొని లోపలే ఉన్నారు. పోలీసులు బయటకు రావాలని కోరినప్పటికీ గంటలుగా ఆయన అనుచరులు ఇదిగో వస్తున్నారు.. అదిగో వస్తున్నారని చెప్పారు. ఆయన మాత్రం బయటకు రాలేదు. ధ్యానం చేసుకొని వస్తారని, ధ్యానం చేసుకుంటారని, స్నానం చేసి వస్తారని, స్నానం చేస్తున్నారని, ఫలహారం చేస్తున్నారని.. అరగంటలో బయటకు వస్తారని, పది నిమిషాల్లో వస్తారని, పోలీసులు అందరు ఇంటి ఆవరణ నుండి బయటకు వెళితే వస్తారని అనుచరులు చెప్పారు. కానీ గంటలు గడిచినా లగడపాటి మాత్రం బయటకు రాలేదు.

పోలీసులు అందరూ బయటకు వెళ్తే లగడపాటి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారని కాంగ్రెసు నేతలు చెప్పారు. కానీ పోలీసులు అందరూ బయటకు వెళ్లినా అతను రాలేదు. అయితే బాబు పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించేందుకు మరో కొన్ని గంటలు పట్టనుంది. కాబట్టి అప్పటి వరకు లోపలే ఉండాలనేది లగడపాటి వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు పోలీసులు కూడా లగడపాటి అక్కడ నుండి బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
మూడేళ్ల క్రితం దీక్ష పేరుతో హైదరాబాద్ వచ్చి నిమ్స్‌లో తేలిన లగడపాటి అనుభవం పోలీసుల కళ్లముందు కదలాడుతోంది. దీంతో వారు ఆయనను బయటకు వెళ్లకుండా అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా చంద్రబాబును అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెసు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నేతలు అరెస్టయ్యారు.
బాబును అడ్డుకునేందుకు భారీ ఎత్తున కార్యకర్తలను కాంగ్రెసు సమీకరిస్తోంది. అంతే పోటీగా బాబుకు ఘన స్వాగతం పలికేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం భారీగా కార్యకర్తలు తరలి వస్తున్నారు. గరికపాడు వద్ద బాబు పాదయాత్ర నల్గొండ జిల్లాలో నుండి కృష్ణా జిల్లాలోకి ఈ రోజు ప్రవేశిస్తుంది. తాము బాబును అడ్డుకోమని, జిల్లా ప్రజల మనోభావాలు చెప్పేందుకే వచ్చామని దేవినేని నెహ్రూ, అవినాష్‌లు అన్నారు.
లగడపాటి కేవలం బాబును కలిసి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారని, పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని దేవినేని మండిపడ్డారు. ఇది సరికాదన్నారు. తెలంగాణలో తిరిగినప్పుడు తెలంగాణ భాష మాట్లాడారని, ఇక్కడికి వచ్చినప్పుడు ఆ భాషను సరి చేసుకోవాలని ఆయనను విజ్ఞప్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications