తెలంగాణ: షిండే, చిద్దూపై కేసు: ఇందిరవిగ్రహం ధ్వంసం

దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విగ్రహాన్ని వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వరంగల్ జిల్లాలోని బ్రాహ్మణవాడలో ఇది జరిగింది. ఈ దాడిలో ఇందిర ఓ చెయ్యి విరిగింది. ముక్కు, చెవి విరిగిపోయాయి. ఇది తెలంగాణవాదుల పని అయి ఉంటుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం, కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణపై నెల వాయిదాపై మరోసారి మాట మార్చిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణవాదులు జిల్లాలో కాంగ్రెసు, తెలంగాణ వ్యతిరేకుల విగ్రహాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు.
షిండేపై చీటింగ్ కేసు
కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే పైన చీటింగ్ కేసు పెట్టాలని రంగారెడ్డి జిల్లా కోర్టు సోమవారం ఎల్బీ నగర్ పోలీసులను ఆదేశించింది. తెలంగాణపై కేంద్రం యు టర్న్ తీసుకుందని, మాట ఇచ్చి తప్పారని ఆరోపిస్తూ నరేష్ కుమార్ అనే లాయరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. మరో కేంద్రమంత్రి చిదంబరం పైన కూడా పిటిషన్ దాఖలైంది. ఆయన పైనా కేసు పెట్టాలని ఆదేశించింది. కేసు నమోదు చేసి ఫిబ్రవరి 14లోగా నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.
సిఎం పదవిపై ఆశతోనే
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి ముఖ్యమంత్రి పదవి పైన ఉన్న ఆశతోనే కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి వంత పాడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సోమవారం హైదరాబాదులో అన్నారు. ఇందిరాపార్కు వద్ద సమరదీక్షలో నారాయణ మాట్లాడారు.
కాంగ్రెసు పార్టీ అన్ని పార్టీలను అఖిల పక్షం పేరుతో పిలిచి అవమానించిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే కాంగ్రెసు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండేలచే అధిష్టానం నాటకాలు ఆడిస్తోందన్నారు. నిన్న తెలంగాణపై చర్చల ప్రక్రియ అంటూ ఆజాద్, షిండే చేసిన ప్రకటనను జానా రెడ్డి సమర్థించడం సరికాదన్నారు.
మూడు రాష్ట్రాల కోసం పోరాడుదాం
ఇంతకాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేసిన ఎవరు కూడా రాయలసీమ ప్రాంతం గురించి పట్టించుకోలేదని బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. అందరం కలిసి మూడు రాష్ట్రాల గురించి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ వెళ్లి చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న పార్టీలను కలుస్తామన్నారు. తెలంగాణ నేతలు కూడా మూడు రాష్ట్రాలకు డిమాండ్ చేయాలన్నారు. మూడు ప్రాంతాల నేతలతో మాట్లాడుతామని కేంద్రం చెప్పడం తమ విజయం అన్నారు.












Click it and Unblock the Notifications