బాలయ్యకు చేదు అనుభవం: బాబుతో భేటీకి నో
గుంటూరు : గుంటూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, తన బావ నారా చంద్రబాబు నాయుడిని కలిసేందుకు వచ్చిన హీరో బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం సాయంత్రం వేమూరు ప్రాంతంలోని బాబు బసకు చేరుకున్న బాలయ్యను చంద్రబాబును కలవకుండా పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ఉన్న బస్సులోకి వెళ్లకుండా ఆయనను పోలీసులు అనుమతించలేదు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మరో 48 గంటల పాటు బాబును కలిసేందుకు అనుమతించబోమని చెప్పారు. లేదంటే ఈ రెండు రోజులూ బాబుతోనే బస్సులో ఉండిపోవాల్సి వస్తుందన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున అలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పినా పోలీసులు ససేమిరా అన్నారు.

కోడ్ పరిధిలోకి కుటుంబ సభ్యులు రారనే విషయాన్ని గుర్తుచేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు అక్కడి నుంచే కలెక్టర్‌తో మాట్లాడారు.
బాలకృష్ణ చంద్రబాబు కుటుంబ సభ్యుడనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో బుధవారం 8 గంటలకు బాబును కలిసేందుకు బాలయ్యకు అనుమతి ఇస్తూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. అంతకుముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు సాయంత్రం 4 గంటలకే పాదయాత్రను నిలిపేసి బస్సులోకి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications