కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఈజీ కాదు: సోనియా గాంధీ

పార్టీలోని అన్ని శ్రేణులు, నాయకుల సహకారంతోనే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్షురాలిగా 15 ఏళ్లు పూర్తి చేసుకొన్న సోనియాకు అభినందనల వర్షం కురిసింది. ఈ సందర్భంగా సోనియా చేసిన ప్రసంగంలో భావోద్వేగం తొణకిసలాడింది. క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి నాయకుల దాకా అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
కార్యకర్తల కష్టం ప్రేమ, మమకారాల వల్లే ఈ ఘనత సాధ్యమయిందన్నారు. ఈ ఘనత మొత్తం కార్యకర్తలదే అన్నారు. 127 ఏళ్ల పార్టీ చరిత్రలో సుదీర్ఘకాలం అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఆమె రికార్డు సృష్టించారు. సోనియా గాంధీ 1998 మార్చిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటికి పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 2004లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. సోనియా నాయకత్వంలో యూపిఏ 1, యూపిఏ 2 అధికారంలోకి వచ్చాయి.
కాగా ఆమె పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు కేవిపి రామచంద్ర రావు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ... మేడమ్ మీరు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని, మీ నాయకత్వంలో మళ్లీ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని శుభాకాంక్షలు అందించారు.
మీ నాయకత్వంలో పనిచేయడం మా అదృష్టమంటూ సుబ్బిరామి రెడ్డి కొనియాడారు. హాట్రిక్ సాధిస్తాం మేడం.. అని వి హనుమంత రావు పలికారు. ఆమెను కలిసినవారిలో హర్ష కుమార్, ఎంఎ ఖాన్ తదితరులు ఉన్నారు. ఇక కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, సర్వే సత్యనారాయణ, ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డితో సహా పలువురు లోక్‌సభలో సోనియా వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications