జగన్‌పై ప్రేమతో కాదా?: ఎమ్మెల్యేల జంప్ వెనుక..!

ఇటీవల అవిశ్వాసం తీర్మానం సమయంలో విప్ జారీ చేసినప్పటికీ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. జగన్ పార్టీ స్థాపించినప్పటి నుండి వరుసగా ఎమ్మెల్యేలు అటు వైపుకు వెళ్తుండటం కాంగ్రెసు పార్టీని ఇబ్బందులకు గురి చేస్తోంది. అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రయత్నాలు చేసినా కుదరడం లేదు.
కాంగ్రెసు వరుసగా రెండోసారి అధికారంలో ఉన్నప్పటికీ జగన్ వైపు పలువురు ఎమ్మెల్యేలు క్యూ కట్టడానికి కారణం.. మూడోసారి పార్టీ అధికారంలోకి రాదనే ఉద్దేశ్యంతోనే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందనే పూర్తి నమ్మకం లేకపోవడం వల్లనే అటు వెళ్తున్నారని అధికార పార్టీలో కూడా చర్చ జరుగుతోందట. 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుండి రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి.
1983, 1985లలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1999లో కాంగ్రెసు గెలుపొందింది. ఆ తర్వాత 1994, 1999లలో తిరిగి టిడిపి గెలిచింది. 2004, 2009లలో కాంగ్రెసు గెలిచింది. అప్పుడు ఎన్టీఆర్ హవా, ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వ పటిమ వల్ల టిడిపి గెలిచిందని, ఇప్పుడు టిడిపి, కాంగ్రెసులు కాకుండా ప్రజలు కొత్త పార్టీ వైపు చూస్తున్నారనే అభిప్రాయం జారిపోతున్న ఎమ్మెల్యేలలో ఉందంటున్నారు.
2004లో భారీ సీట్లు సాధించిన కాంగ్రెసు అదే వైయస్ నాయకత్వంలో స్వల్ప మెజార్టీతోనే గట్టెక్కిందని గుర్తు చేస్తున్నారు. వైయస్ ఉన్నా 2014లో అధికారంలోకి రావడం కష్టంగానే ఉండేదనే భావనలో ఉన్నారట. అయితే, వైయస్ మృతి కారణంగా జగన్ పార్టీకి సానుభూతి పవనాలు వీస్తున్నాయని, జగన్ జైలులో ఉండటం ఆ పార్టీకి మరింత ప్లస్ అవుతుందని, వీటినన్నింటిని బేరీజు వేసుకొనే ఎమ్మెల్యేలు అటు వైపుకు వెళ్తున్నారట.
కాంగ్రెసు పార్టీ మరోసారి అధికారంలోకి రావడమనే విషయాన్ని పక్కన పెడితే అదే పార్టీలో ఉంటే తమ నియోజకర్గంలో తాము గెలిచే అంశంపై కూడా ఎమ్మెల్యేలు విశ్వాసంగా లేరట. జగన్ పార్టీలోకి వెళ్తే జగన్ హవా, సానుభూతి కలిసి వచ్చి గెలుస్తామనే అభిప్రాయంతో ఉన్నారట. పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలకు కిరణ్ పైనో లేదా కాంగ్రెసు పైనో వ్యతిరేకమో, జగన్ పైన ప్రేమో లేదని, కేవలం తమ గెలుపు అవకాశాలు అక్కడ ఉన్నందువల్లే వెళుతున్నారని కాంగ్రెసు వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట. వైయస్ పథకాలను కిరణ్ ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని ఆరోపిస్తున్న జగన్ పార్టీ కూడా నిరూపించేందుకు సిద్ధంగా లేదని, అయితే పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఈ స్లోగన్ వారికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారట.












Click it and Unblock the Notifications