మోడీపై అసంతృప్తి: నితీష్ కుమార్‌కు 'ప్రత్యేక' గాలం

బిజెపికి దూరమవుతున్న జెడి(యూ)ను చేరదీసేందుకు యూపిఏ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే అన్నట్లు బీహార్ ఎప్పటి నుంచో కోరుతున్న ప్రత్యేక ప్యాకేజిని మంజూరు చేసింది. ఏకంగా రూ. 12వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని బీహార్‌కు ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. వెనకబడిన ప్రాంతాల గ్రాంటు కింద రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం కేటాయిస్తారు. బీహార్‌కు కనీసం రూ.20 వేల కోట్లు కేటాయించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాల వెనకబాటుతనానికి ప్రమాణాలేంటన్న విషయమై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు ఇంతకుముందే వార్తలొచ్చాయి. ఇప్పుడు బీహార్‌తో పాటు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా వెనకబడ్డాయని, ఇవి కూడా కేంద్ర సాయం పొందడానికి అర్హత ఉన్నవేనని అంటున్నారు.
అసలు తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కూడా నితీష్ కోరుతున్నారు. ఇందుకోసం ఏకంగా ఢిల్లీలో ఓ ర్యాలీ కూడా చేశారు. తమకు ప్రత్యేక హోదా ఇచ్చిన వాళ్లే ఢిల్లీని పాలిస్తారని అప్పట్లో చెప్పారు. దీన్నిబట్టి ఇప్పుడు ఆయన్ను తమ జట్టులోకి తీసుకోవాలని యూపిఏ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications