ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చేసిన తప్పులకు చెంపలేసుకో: విజయమ్మతో హరీష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: రచ్చబండను చేవెళ్లలో కాకుండా ఖమ్మం జిల్లా బయ్యారంలో పెట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను డిమాండ్ చేశారు. బయ్యారం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తరలించాలనే ప్రభుత్వ నిర్ణయంపై విజయమ్మ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ వనరులను దోపిడీ చేశారని, బయ్యారం గనులను అల్లుడు అనిల్ కుమార్‌కు కట్టబెట్టారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.

చేసిన తప్పులకు చెంపలేసుకుని బయ్యారం గనులు తెలంగాణ ప్రాంతానికే దక్కాలని చెబుతారా లేదా అని ఆయన విజయమ్మను అడిగారు. బయ్యారం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించాలనే ప్రభుత్వ నిర్ణయంపై మాట్లాడకపోతే తెలంగాణ వనరుల దోపిడీకి అంగీకరిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి దోపిడీని కొనసాగించినవారవుతారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు బయ్యారం గనుల దక్కాలని పోరాటం చేయాలని, లేకుంటే వైయస్ విజయమ్మ తెలంగాణపై మాటలే చెబుతున్నారని అనుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

బయ్యారం గనులపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బయ్యారం గనులపై తెలుగుదేశం తెలంగాణ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ మాట, ఆంధ్ర ప్రాంత నాయకుడు వర్ల రామయ్య మరో మాట మాట్లాడుతున్నారని, ప్రాంతాలవారీగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఎవరు మాట్లాడినా లెక్కలోకి తీసుకోవద్దని, తాను మాట్లాడితే మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని చంద్రబాబు అన్నారని, అందువల్ల చంద్రబాబు బయ్యారం ఇనుప ఖనిజం తరలింపుపై తన వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రతిపక్ష నాయకుడిగా తన వైఖరిని వెల్లడించాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందని, చంద్రబాబును అడిగే హక్కు తమకు ఉందని హరీష్ రావు అన్నారు. చంద్రబాబు చెప్పరు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వినరని, అందువల్ల ఇద్దరూ ఒక్కటే అనుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. దోపిడీని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించరని ఆయన అడిగారు.

ఉక్కు కర్మాగారం స్థాపించడానికి అవసరమైన సహజ వనరులన్నీ ఖమ్మం జిల్లాలో ఉన్నాయని, బయ్యారం ఇనుప ఖనిజం ఉన్న ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం స్థాపించాలని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ స్థాపించాలని ఆయన డిమాండ్ చేశారు. బయ్యారం ఇనుప ఖనిజాన్ని విశాఖకు తరలించే ప్రయత్నాలను అడ్డుకుంటామని, ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతామని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని నినదించినట్లుగానే, బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు నినదించాలని, పార్టీలకు అతీతంగా ఉద్యమం చేపట్టాలని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో పది శాతం మంది కూడా తెలంగాణ ఉద్యోగులు లేరని ఆయన అన్నారు. ముడిసరుకు తెలంగాణది, ఉద్యోగాలు తెలంగాణేతరులవా అని ఆయన ప్రశ్నించారు.

విశాఖకు ఇనుప ఖనిజాన్ని తరలించి, బయ్యారంలో ఫిల్టరైజేషన్ ప్లాంట్ పెట్టాలనే ఆలోచనను ఆయన వ్యతిరేకించారు. తెలంగాణకు దుమ్మూ ధూళీ తప్ప ఏమీ మిగలదని ఆయన అన్నారు. ఉక్కు మీది, తుక్కు మాదా అని ఆయన అడిగారు. డోలమైట్‌ను కూడా ఖమ్మం జిల్లా నుంచి తరలిస్తున్నారని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లాలో ముడి ఇనుము, డోలమైట్, సున్నంరాయి, కరెంట్, నీళ్లు వంటి అన్ని సహజ వనరులు ఉన్నాయని, స్థానికావసరాలను తీరిన తర్వాతనే ముడి సరుకులను ఇతర ప్రాంతాలకు తరలించాలనే సహజ న్యాయ సూత్రాన్ని అమలు చేయాలని ఆయన అన్నారు.

బయ్యారం ఇనుప ఖనిజం తరలిపోకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులపై, శాసనసభ్యులపై ఉందని ఆయన అన్నారు. బయ్యారం ఇనుప ఖనిజం తరలిపోకుండా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెసు నాయకులపై ఉందని ఉందని, మౌనం వహిస్తే దోపిడీకి అంగీకరించినట్లేనని ఆయన అన్నారు.

English summary
The Telangana Rastra Samithi (TRS) MLA T Harish Rao demanded the YSR Congress honorary president YS Vijayamma to clarify stand on Bayyaram mines issue. He also demanded the Telugu Desam party president Nara Chandra Babu Naidu's stand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X