ఆ మాటలు నమ్మి ప్రతి కుటుంబమూ మోసపోయింది
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కూటమి విజయోత్సవాలను నిర్వహించుకోగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యమించింది. వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన ప్రదర్శనలను చేపట్టింది.
ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. టీడీపీ కూటమికి 10 అంశాలతో కూడిన ప్రశ్నలు వేశారు. రెండేళ్ల క్రితం చంద్రబాబు ప్రజల ముందుకు వచ్చి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఎన్నో హామీలు ఇచ్చారని, మొత్తం 143 హామీలు తన మేనిఫెస్టోలోను బాండ్ల రూపేనా, ప్రతి ఇంటికీ వెళ్లి రాసి మరి ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీలు ఏమయ్యాయని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారని అన్నారు.

రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు.. ఇలా దాదాపు అన్ని వర్గాల వారిని చంద్రబాబు మోసం చేశారని జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు విని చివరకు ప్రతి కుటుంబం మోసపోయిందని అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదని విమర్శించారు. టీడీపీ కూటమి పాలన అంతా కూడా ప్రతి క్షణం మోసం, దగా, స్కాంల మయమేనని పేర్కొన్నారు.
ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు.. పచ్చి అబద్ధాలు, సంక్షేమం కాదు.. మోసం, ప్రజాపాలన కాదు రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయానక పాలన అని జగన్ గుర్తు చేశారు. ఈ రెండేళ్ల కాలంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని, మహిళలు, చిన్నారులకు రక్షణ అనేదే లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బతీశారని, జంగిల్‌రాజ్‌లా రాష్ట్రాన్ని నడుపుతున్నారని, సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడ్ని ఏమంటామని వ్యాఖ్యానించారు.
అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక,మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్ అన్నీ మాఫియాలు నడుపుతున్నారని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని జగన్ అన్నారు. మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకూ పెరుగుతోందని, కరెంటు ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ పై వ్యాట్, నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు ఇలా అన్నిరకాలుగా ప్రజలపై భారం మోపారని, ప్రజల ఆదాయం పెరిగే చర్యలు తీసుకోవట్లేదని చెప్పారు.
విద్య, వైద్య రంగాలు దెబ్బతిన్నాయని, వ్యవసాయం సంక్షోభంలో ఉందని జగన్ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశలు చూపించారే గానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్‌లతో వారి భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారని జగన్ అన్నారు. ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోందని, ఏ కుటుంబాన్ని కలిసినా మోసపోయామనే బాధ వినిపిస్తోందని జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications