తెలంగాణలో రెండు రోజుల్లో ఆ భూముల సమస్య పరిష్కారం: రేవంత్ స్ట్రిక్ట్ ఆదేశాలు
తెలంగాణలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న 22ఎ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గతంలో రిజిస్ట్రేషన్ల కోసం ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుని నిరీక్షిస్తున్న భూ యజమానులకు భారీ ఉపశమనం కలిగించబోతోంది. రాబోయే రెండు రోజుల్లోనే వారి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు భూ వివాదాల పరిష్కారంపై సచివాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. 22-ఏ సంబంధించిన దరఖాస్తులన్నింటినీ ఆయా జిల్లాల కలెక్టర్లు స్వయంగా, క్షుణ్ణంగా పరిశీలించాలని, ఈ ప్రక్రియలో ఎక్కడా జాప్యానికి ఆస్కారం ఉండకూడదని అన్నారు. సత్వర నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

పౌరుల ఆస్తి హక్కును కాపాడే విషయంలో చిత్తశుద్ధితో పని చేస్తోన్నామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. సొంత భూములను రిజిస్టర్ చేసుకోవాలనుకునే సాధారణ ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. సాంకేతిక లోపాలు చోటు చేసుకోకుండా, పారదర్శకంగా పనులను వేగవంతం చేయాలని చెప్పారు. నిషేధిత భూముల సమస్యలపై ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.
ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూముల్లో ఒక్క అంగుళాన్ని కూడా నష్టపోనివ్వబోమని, ప్రతి ఒక్కరి హక్కులను కాపాడుతామని, ప్రత్యేకించి.. 22-ఎ పరిధిలోని భూముల సమస్యల పరిష్కారం కోసం దళారులు లేదా మధ్యవర్తులను ఆశ్రయించి డబ్బులు నష్టపోవద్దని సూచించారు. ఈ విషయంలో సోషల్ మీడియా లేదా ఇతరులు ప్రచారం చేసే ఎలాంటి తప్పుడు సమాచారాన్ని, పుకార్లను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.
గతంలో వివిధ కారణాల వల్ల నిషేధిత ఆస్తుల జాబితాలో చేరిన భూభాగాలు, వివాదాలను నిశితంగా క్రమబద్ధీకరించడంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రాథమికంగా దరఖాస్తులను పరిశీలించి, అనవసరంగా లేదా పొరపాటున 22-ఎ జాబితాలో చేరిన భూములను వెంటనే ఆ జాబితా నుంచి తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అర్హులైన నిజమైన ఆస్తిదారులకు సత్వరమే రిజిస్ట్రేషన్ చేయాలని అన్నారు.













Click it and Unblock the Notifications