కన్నడనాట విన్‌పై ఎవరి ధీమా వారిదే: అభ్యర్థుల్లో టెన్షన్
బెంగళూరు: కన్నడనాట ప్రచార హోరు ముగిసింది. రెండు రోజుల్లో ఎన్నికలు జరిగి.. ఐదు రోజుల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? హంగ్ ఏర్పడనుందా?.. ఇప్పుడు అభ్యర్థులను, పార్టీలను వెంటాడుతున్న ప్రశ్న. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోన మాత్రం ఆందోళన కనిపిస్తోంది! కాంగ్రెసుకు కొంత సానుకూలంగా, అధికార బిజెపికి వ్యతిరేకంగా మాత్రం కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు చెప్పారు.
అయితే, మొదట అనుకున్నంత వ్యతిరేకత బిజెపి పైన ఓటరు దేవుడిలో క్రమంగా తగ్గింది. మొదట కాంగ్రెసుకు స్పష్టమైన మెజార్టీ వస్తుందని చెప్పినా క్రమంగా బిజెపి వైపుకు కూడా ఓటర్లు మొగ్గు చూపుతుండటంతో ఇప్పుడు ఎవరికి మెజార్టీ రాకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిజెపి క్రమంగా పుంజుకున్న నేపథ్యంలో హోరాహోరీగానే ఎన్నికలు జరగనున్నాయని చెబుతున్నారు.

అవినీతి ప్రభుత్వమన్న కాంగ్రెసును బిజెపి నేతలు ధీటుగానే ఎదుర్కొనే ప్రయత్నాలు చేశారు. అయితే, కాంగ్రెసు కూడా అదే స్థాయిలో బిజెపిపై నిప్పులు చెరిగింది. జెడి(ఎస్) కీలకంగా మారనుంది. పలు ప్రాంతాల్లో ఆ పార్టీకి మంచి పట్టు ఉంది. ఇక బిజెపిని వీడి సొంత కుంపటి పెట్టుకున్న బిఎస్సార్ కాంగ్రెసు బిజెపిని బళ్లారిలో దెబ్బతీయనుంది. యడ్యూరప్ప ఆధ్వర్యంలోని కర్నాటక జనతా పార్టీకి గెలుపు అవకాశాలు లేకున్నా బిజెపిని నష్టపరుస్తుంది.
బెంగళూరు నగరం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం బిజెపి చేతిలోనే ఎక్కువ స్థానాలు ఉన్నాయి. ఈసారి ఈ పార్టీల మధ్య హోరాహోరీ జరుగనున్నప్పటికీ కాంగ్రెసు ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ కర్నాటకలో జెడి(ఎస్) ప్రభావం ఎక్కువ. రాష్ట్రంలో చాలాచోట్ల ముస్లింలు కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతున్నా దక్షిణాన మాత్రం జెడి(ఎస్) వైపు మొగ్గు చూపిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీకి ముంబయి కర్నాటకలో మంచి పట్టు ఉంది. ఈ ప్రాంతంలో లింగాయత్‌ల ప్రాబల్యం ఎక్కువ. యడ్యూరప్ప అదే వర్గానికి చెందిన నేత. కాబట్టి 2008లో ఇక్కడ బిజెపి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. యడ్యూరప్ప వెళ్లినా ఆ ఓట్లను క్యాష్ చేసుకునేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన జగదీష్ షెట్టార్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. బిఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభావం చూపుతుందని భావించినా... ఆ పార్టీ బిజెపి ఓట్లు మాత్రమే చీల్చుతుందని, తద్వారా కాంగ్రెసు పార్టీకి లబ్ధి చేకూరనుందంటున్నారు.












Click it and Unblock the Notifications