ప్రచార చిక్కుల్లో నటి: వెంకయ్యకు చేదు అనుభవం

ఎన్నికల సంఘానికి ప్రచారకర్తగా ఉన్న ఐంద్రిత రాయ్.. ఈ నెల 2న బెంగళూరులో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో కలిసి రోడ్డు షో, ఎ్నికల సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార రాయబారిగా ఉన్న ఆమె.. రాజకీయ పార్టీల తరఫున, అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఈసి చెబుతోంది.
కన్నడ నటి ఐంద్రిత రాయ్ ఓ అభ్యర్థి తరఫున ప్రచారం చేసినట్లుగా తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేశామని, నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని కర్నాటక రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ కుమార్ ఝా తెలిపారు.
ప్రశాంతంగా ఎన్నికలు
కర్నాటకలో ఈ రోజు ఉదయం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి జగదీష్ శెట్టార్ బెంగళూరులోని ఓ పోలింగు కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. మల్లేశ్వరంలో బిజెపి అగ్రనేత వెంకయ్య నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా వెంకయ్యకు చేదు అనుభవం ఎదురయింది. వెంకయ్య నాయుడు వరుసలో కాకుండా నేరుగా ఎన్నికల కేంద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. పలువురు ఓటర్లు ఆయనను అడ్డుకున్నారు. క్యూలో రావాలని సూచించారు. తనకు విమానం ఉందని, సమయం అయిపోతుందని అతను చెప్పారు. అనంతరం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపు బిజెపిదేనని ఈ సందర్భంగా వెంకయ్య అన్నారు. అవినీతిపరులను పక్కనే పెట్టుకొని బిజెపిపై కాంగ్రెసు విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు. ఆరోపణలను ఎదుర్కొంటున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, కర్నాటక జనతా పార్టీ అధ్యక్షుడు బిఎస్ యడ్యూరప్ప శికారిపురలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఆరు గంటల వరకు జరుగనుంది. పోలింగ్ కోసం 223 అసెంబ్లీ నియోజకవర్గాలలో 52,034 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు మూడువేల మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహిళా అభ్యర్థులు 170 మంది.












Click it and Unblock the Notifications