జగన్ కోసమే అవిశ్వాసం, కడియం తిట్టారు: ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అవిశ్వాస తీర్మానంపై తెలుగుదేశం పార్టీ తటస్థంగా ఉండడాన్ని కడియం శ్రీహరి విమర్శించడంపై ఆయన ఆ వ్యాఖ్య చేశారు. బ్లాక్ మెయిల్ చేసి, జగన్‌కు బెయిల్ తెచ్చుకోవడానికి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారని, అందుకే తమ పార్టీ మద్దతు ఇవ్వలేదని ఆయన అన్నారు.

కడియం శ్రీహరి రాజీనామా వల్ల తమకు ఏ విధమైన నష్టం లేదని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో భేటీ తర్వాత ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరి పార్టీ వల్ల ఉన్నత పదవులు అనుభవించారని, పార్టీ వల్ల కడియం గౌరవం పెరిగిందని ఆయన అన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవచ్చునని, అయితే పార్టీని గానీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని గానీ విమర్శించవద్దని ఆయన సలహా ఇచ్చారు.

పార్టీ నుంచి చాలా మంది పెద్ద పెద్ద నాయకులే వెళ్లిపోయారని, వారు తిరిగి వచ్చారని, ఎవరు వెళ్లిపోయినా పార్టీకి నష్టం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై ఇంతకన్నా ముందుకు పోలేదని కడియం శ్రీహరే అన్నారని ఎర్రబెల్లి చెప్పారు. తమ పార్టీకి కార్యకర్తల బలమే కొండంత అండ అని అన్నారు. చంద్రబాబు పాదయాత్ర నుంచి వచ్చిన తర్వాత చర్చిద్దామని చెప్పామని, కడియం శ్రీహరి తొందరపడ్డారని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను, ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును కడియం శ్రీహరి తిట్టినంతగా మరెవరూ తిట్టలేదని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ పార్టీలోకి ఎలా వెళ్తారని ఆయన అడిగారు. తెలంగాణ విషయంలో తమ పార్టీపై అభాండాలు వేయడం సరి కాదని ఆయన అన్నారు. ఈ నెల 14వ తేదీన బయ్యారంపై ఉద్యమిద్దామని అనుకున్నామని, దాంతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిద్దామని అనుకున్నామని, ఈ విషయాలు కడియం శ్రీహరికి తెలుసునని అన్నారు.

తెలంగాణ కోసమైతే కడియం శ్రీహరి తెరాసలోకి వెళ్లరని, స్వార్థం కోసమైతేనే వెళ్తారని ఆయన అన్నారు. తెలంగాణపై చంద్రబాబుకు స్పష్టత ఉందని అన్నారు. డబ్బులున్నవారికే పదవులు ఇస్తున్నారనే కడియం శ్రీహరి విమర్శను ఆయన ఖండించారు. పదవులు దక్కించుకున్నవారిలో డబ్బులున్నవారున్నారు, లేనివారున్నారని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని తాము ఎన్నికల ప్రణాళికలో పెడుతున్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసును డిమాండ్ చేయాలి గానీ తమ పార్టీని కాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+