బాబుకు ఝలక్: కడియం రాజీనామా, కారుపై స్వారీ

కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరనున్నట్లు సమాచారం. పార్టీ తనను గుర్తించనందుకే రాజీనామా చేసినట్లు కడియం శ్రీహరి మీడియా ప్రతినిధులతో చెప్పారు. గత రెండు రోజులుగా చంద్రబాబు కడియం శ్రీహరితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన చంద్రబాబుకు అందుబాటులోకి రాలేదు. ఎన్టీ రామారావు ప్రభుత్వంలోనూ నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు.
ఈ నెల 15వ తేదీన కడియం శ్రీహరి తెరాసలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కెసిఆర్ ఆ రోజు వరంగల్ వస్తున్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి తెరాసలో చేరుతారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తనపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో కడియం శ్రీహరి మనస్తాపానికి గురయ్యారు. ఇరువురి మధ్య తీవ్ర విభేదాలు పొడసూపాయి. కడియం శ్రీహరి టిడిపికి రాజీనామా చేస్తారని ఈ సయమంలోనే ప్రచారం సాగింది.
శుక్రవారం కడియం శ్రీహరి హన్మకొండలోని తన నివాసంలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి సంబంధించి మండలాల వారీగా తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. మెజారిటీ నేతలు మాత్రం ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణవాదం వైపు నిలబడటంలో తప్పు లేదని తేల్చినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులోనూ తెలంగాణకు అనుకూలంగా స్పష్టంగా నిలబడే అవకాశం లేదని, ప్రజలు తెలంగాణవైపు నిలబడడం వల్ల వచ్చే ఎన్నికల్లో తప్పనిసరి ఓటమి తప్పదని నేతలు విశ్లేషించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications