తెలంగాణ, జగన్: మోడీపై టిడిపి ఆశలు, బాబు డైలమా!

ఈసారి బిజెపితో కలిసి పోటీ చేయడం మంచిదని పలువురు టిడిపి నాయకులు పార్టీ నాయకత్వానికి చెబుతున్నారట. బిజెపికి మతతత్వ పార్టీ అనే అపోహ ఉందని, ఈ అపోహ తొలగించుకోవడానికి బిజెపి ప్రయత్నిస్తే, ఎన్‌డిఏకు మద్దతు ఇవ్వడానికి టిడిపి సిద్ధంగా ఉంటుందని ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం ప్రకటించారు. బయ్యారంలో ఆందోళన సాగించడానికి వెళుతూ టిడిఎల్‌పి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
మోడీకి కొన్ని సెక్షన్లలో ఎంత వ్యతిరేకత ఉందో, అదే విధంగా మరికొన్ని సెక్షన్లలో అంతటి క్రేజీ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని బిజెపితో పొత్తుకు కొందరు టిడిపి నాయకులు ఆసక్తి చూపుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. బిజెపి మిత్రపక్షంగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్ల సమయంలో మోడీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాల్సిందే అంటూ చంద్రబాబు నాయుడు అప్పుడు డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే పార్టీ నాయకులు బాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలంటే మోడీ ఇమేజ్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారట.
కార్గిల్ యుద్ధం వల్ల బిజెపి ఇమేజ్ పెరిగింది, అది 1999 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడానికి ఉపయోగపడిందనేది పలువురి వాదన. వరుసగా రెండుసార్లు అధికారానికి దూరం కావడం, ఓ వైపు తెలంగాణ, మరోవైపు జగన్ కారణంగా టిడిపి పరిస్థితి గందరగోళంగా ఉందనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బిజెపితో పొత్తు వల్ల మోడీకి ఉండే క్రేజ్ టిడిపికి సైతం ఉపయోగకరంగా ఉంటుందనేది కొందరు టిడిపి నాయకుల వాదనగా ఉందట. పలువురు నేతలు ఇందుకోసం అధ్యక్షుడిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట.
అయితే, చంద్రబాబు పాదయాత్ర చేశార పార్టీ పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చిందని, టిడిపియే అధికారంలోకి వస్తుందని, పార్టీ పుంజుకున్న సమయంలో బిజెపితో పొత్తు సరికాదనే వాదన కూడా ఉందంటున్నారు. ప్రధానంగా తెలంగాణ టిడిపి నేతలు బిజెపితో పొత్తు కోసం ఉవ్వీళ్లూరుతున్నారట. తెలంగాణ అంశంతో పాటు జగన్‌కు ఓ వర్గం చేరువవుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టిడిపికి లబ్ధి చెందాలంటే బిజెపితో పొత్తు మంచిదని కొందరు నేతలు నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారట.
తెలంగాణ ప్రాంతంలోనే ముస్లిం మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉందని, బిజెపితో పొత్తు వల్ల ఈ ప్రాంతంలో పార్టీకి నష్టం అనే వాదన వినిపించేది. కానీ ఇప్పుడు మిగిలిన ప్రాంతాల కన్నా తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులే బిజెపితో పొత్తుకు ఉత్సాహం చూపిస్తున్నారట. తెలంగాణ వాదన తెలంగాణలో టిడిపిని ఒంటరిని చేయడంతో బిజెపిని నమ్ముకోవడం మంచిదనే అభిప్రాయం తెలంగాణ ప్రాంత నాయకులు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications