లోకేష్ అట్రాక్షన్: ఎన్టీఆర్ మరింతదూరం, హరిపై సస్పెన్స్

మహానాడులో లోకేష్‌ను ప్రధాన ఆకర్షితుడిగా నిలబెట్టే ఉద్దేశ్యంలో భాగంగానే ముందస్తుగా ఆయనను మినీ మహానాడుకు పంపించి ప్రపేర్ చేయించారని అంటున్నారు. గండిపేటలో ఈ రోజు నుండి రెండు రోజుల పాటు సాగే మహానాడులో పార్టీలోని ఓ ముఖ్య నేతగా లోకేష్ వేదిక పైకి ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా చంద్రబాబు నాయుడు తర్వాత టిడిపి భావి నేత లోకేష్ అని చెప్పే ప్రయత్నాలు చేయనున్నారని అంటున్నారు.
నారా లోకేష్ ఇటీవలే రాజకీయ ఆరంగేట్రం చేశారు. మినీ మహానాడులో పాల్గొనేకంటే ముందు లోకేష్ పలు నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించి పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీని బలోపేతం చేసేందుకు సూచనలు చేశారు. ఆ తర్వాత మినీ మహానాడు.. ఇప్పుడు మహానాడులలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. లోకేష్ మహానాడులో పాల్గొని, భావినేతగా తెలుగు తమ్ముళ్ల మదిలో జొప్పిస్తే అది జూనియర్ ఎన్టీఆర్, హరికష్ణలలో మరింత అసంతృప్తి రాజేస్తుందని చెప్పవచ్చు.
మరోవైపు మహానాడుకు రావాల్సిందిగా హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు ఆహ్వానాలు అందాయి. జూనియర్ సినిమా షూటింగు పేరుతో గైర్హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక హరికృష్ణ హాజరీపై సస్పెన్స్ నెలకొంది. ఆయన వస్తాడా? వస్తే ఏం బాంబు పేలుస్తారో? అనే చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి ఈ మహానాడులో లోకేష్ ప్రధాన ఆకర్షణగా నిలువబోగా, జూనియర్ ఎన్టీఆర్‌ను మరింత దూరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications