మాకు ఓటు, మీకు తెలంగాణ : బిజెపిలో ఊపు, చేరికలు

తెరాసలో చేరిన వారంతా వివిధ జిల్లాలవాసులు కావటంతో పార్టీ నేతలు తెలంగాణలోని చాలా ప్రాంతాల నుంచి జన సమీకరణ చేపట్టారు. సోమవారం ఇదే మైదానంలో బిజెపి సభ నిర్వహించింది. తెరాసతో పోల్చితే తమ జన సమీకరణ ఏర్పాట్లు తక్కువ అని, ఆ పార్టీలో చేరిన వారి కంటే, తమ పార్టీలో చేరిన వారూ తక్కువేనని, అయినా తమ సభకు జనం ఎక్కువ వచ్చారని, మైదానం కిక్కిరిసిపోవటంతో పాటు, బయట కూడా జనం నిలబడి ఉన్నారని బిజెపి సంబరపడిపోతుందట.
బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సభ ముగిసిన వెంటనే బాగుందని వ్యాఖ్యానించారని పార్టీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఆయన బిజెపి రాష్ట్ర నాయకత్వాన్ని అభినందించారు. సరైన ప్రణాళికతో పనిచేస్తే లోక్‌సభ స్థానాల్లోనే కాకుండా, అసెంబ్లీ స్థానాల్లోనూ మెరుగైన ఫలితాలు వస్తాయని ఇక్కడి నేతలను ఉత్సాహపర్చినట్లు తెలిసింది. బిజెపి సభ విజయవంతం కావడంతో ఆ పార్టీ నేతల్లో ఆనందం కనిపిస్తోంది.
ఈ ఊపుతో పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు కలిశారట. తెరాసతో బిజెపి పొత్తు పెట్టుకునే అవకాశం లేదని, ఒకరిద్దరు నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పొత్తు ప్రతిపాదన చేసినా కింది స్థాయిలో కేడర్ ఊరుకునే పరిస్థితి లేదంటున్నారు. కేడర్ మనోభావాలకు విరుద్ధంగా తెరాసతో పొత్తు పెట్టుకునే పరిస్థితిలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో తెరాసపై రాజకీయ దాడిని తీవ్రం చేస్తామని కమలనాథులు చెబుతున్నారు. తెరాస వల్ల తెలంగాణ రాదని, ‘మాకు ఓటు, మీకు తెలంగాణ' అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చూస్తున్నారు.












Click it and Unblock the Notifications