అద్వానీ రాజీనామా: థర్డ్ ఉత్సాహంలో ప్రాంతీయ నేతలు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ రాజీనామా ప్రాంతీయ పార్టీలలో ఉత్సాహం కలిగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం యూపిఏ 2 ప్రభుత్వం అన్నింటిలో విఫలమయిందనే అభిప్రాయం ప్రజల్లో ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అవినీతి ఆరోపణలే కాకుండా ధరల పెరుగుదలను నియంత్రించడంలో బిజెపి విఫలమైందనే వాదన ప్రజల్లో బలంగా ఉంది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం బిజెపికి ప్రజల్లో కొంత సానుకూలత పెరిగింది.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆ రాష్ట్రాన్ని చేసిన అభివృద్ధి దేశవ్యాప్తంగా యువతను ఆకట్టుకుంది. ఇది బిజెపికి మరింత ప్లస్ అయింది. దేశవ్యాప్తంగా మోడీమాయ కమ్ముకుంది. యువతలో మోడీ మాయను గుర్తించిన బిజెపి.. అగ్రనేత అద్వానీ వద్దంటున్నప్పటికీ బిజెపి ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇటీవల తన పార్టీలో తన మాట చెల్లుబాటు కాకపోవడంపై కినుక వహించిన అద్వానీ పార్టీ పదవులకు రాజీనామా చేశారు.
ఈ ఉదంతాన్ని గమనించిన ప్రాంతీయ పార్టీలు తమకు ఇది లాభిస్తుందని భావిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెసు క్రమంగా బలహీనపడుతుండగా... బిజెపి బలపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అద్వానీ అంశం ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇది బిజెపికి అతిపెద్ద షాకింగ్ న్యూస్. మోడీ యువతను ప్రభావితం చేస్తున్నప్పటికీ, అద్వానీ లేని బిజెపి వచ్చే ఎన్నికలలో తీవ్ర నష్టాన్ని ఎదురుచూడక తప్పదు. ఇది గుర్తించిన ప్రాంతీయ పార్టీలు ఇక థర్డ్ ఫ్రంట్ ఖాయమని వ్యాఖ్యలు చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై స్పందించారు. బిజెపి అంతర్గత వ్యవహారంపై తాను స్పందించనని చెబుతూ.... ఇక థర్డ్ ఫ్రంట్ ఖాయమని చెప్పారు. తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మాట్లాడుతూ... బిజెపియేతర, కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటుకు ఇదే మంచి తరుణమని వ్యాఖ్యానించారు. మరోవైపు అద్వానీ లేకుండా ఎన్డీయేలో ఉండమంటూ జెడి(యు) పేర్కొంది. మోడి ప్రధాని అభ్యర్థి అయిన పక్షంలో జెడి(యు) థర్డ్ ఫ్రంట్ వైపు చూసే అవకాశాలున్నాయి.
ఎవరేమన్నారు?
అద్వానీ రాజీనామా బాధాకరం. ఆయనకు రాజీనామాపై నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తాం - సుష్మా స్వరాజ్
అద్వానీ రాజీనామా దురదృష్టకరం. రాజీనామాపై ఆయన పునరాలోచించుకోవాలి. మధ్యవర్తిత్వం నెరపం - ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి రామ్ మాధవ్
థర్డ్ ఫ్రంట్‌కే వచ్చే ఎన్నికలలో అవకాశాలు - చంద్రబాబు నాయుడు
థర్డ్ ఫ్రంట్‌కు ఇదే సరైన సమయం - మమతా బెనర్జీ
అద్వానీ లేని ఎన్డీయేలో ఉండలేం. పార్టీ నేతలం భేటీ అయి నిర్ణయించుకుంటాం - శరద్ యాదవ్
అద్వానీ రాజీనామా అనూహ్య సంఘటన - మురళీధర రావు
అద్వానీ రాజీనామా దురదృష్టకరం. రాజీనామా ఉపసంహరించుకునేలా బిజెపి అగ్రనాయకులు ఒప్పిస్తారనుకుంటున్నా - యడ్యూరప్ప
బిజెపిలాంటి పార్టీలలో వర్గపోరు సహజం - సిపిఐ
అద్వానీ రాజీనామాను ఆమోదించవద్దు. ఎన్డీయేకు నాయకత్వం వహించాలి - శివసేన(అద్వానీని భీష్మాచార్యుడితో పార్టీ పోల్చింది)
అద్వానీని రాజీనామా ఉపసంహరించుకోవాలని అభ్యర్థిస్తా. పార్టీ వ్యవస్థాపకుల్లో, ముఖ్య నేతలలో ఆయన ఒకరు - ఉమాభారతి
పార్టీని అద్వానీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు - రాం జెఠ్మలానీ
అద్వానీ రాజీనామా వ్యవహారం బిజెపి సొంత వ్యవహారం. మోడీ నాకు మంచి స్నేహితుడు. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషం - జయలలిత












Click it and Unblock the Notifications