కెసిఆర్: పాత మిత్రులే కొత్త శత్రువులు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వెంట చివరంటా నడిచే వాళ్లు చాలా తక్కువ మంది నాయకులే ఉంటారనే అభిప్రాయం ఉంది. పాత మిత్రులే శత్రువులుగా మారి ఆయనకు చిక్కులు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి, అన్ని పార్టీల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంటుంది. కానీ, చంద్రశేఖర రావు విషయానికి వచ్చే సరికి దుమారం ఎక్కువగా చెలరేగుతోంది. కెసిఆర్ తనయుడు కెటి రామారావుపై ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి ఆరోపణలతో కూడిన వార్తాకథనంతో పార్టీ నుంచి వివిధ కారణాలతో బయటకు వెళ్లిన వారు గొంతు కలిపినట్లు కనిపిస్తున్నారు.
శత్రువులుగా మారిన కెసిఆర్ పాత మిత్రులను ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి తన కథనం ద్వారా కూడగట్టినట్లు కనిపిస్తోంది. కెటి రామారావుపై తాను ప్రసారం చేసిన వార్తాకథనానికి మద్దతు వారి అభిప్రాయాలను ఆంధ్రజ్యోతి సేకరించింది. వారు కెటి రామారావుపై, కెసిఆర్‌పై దుమ్మెత్తి పోశారు. తెలంగాణకు చెందిన ఆ నాయకులు తాము తెలంగాణకు అనుకూలంగా ఉన్నామంటూనే కెసిఆర్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెసు శానససభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి, తాజా మాజీ తెరాస నాయకుడు రఘునందన్, మాజీ శాసనసభ్యుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి, మరో మాజీ శానససభ్యుడు మందాడి సత్యనారాయణ రెడ్డి అభిప్రాయాలను ఆంధ్రజ్యోతి సేకరించింది. వారంతా కెసిఆర్‌పై దుమ్మెత్తి పోశారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు సహా ఆ పార్టీకి చెందిన నాయకులు కెసిఆర్‌పై ధ్వజమెత్తడం ఆశ్చర్యకరమేమీ కాదు.

తెరాసలో కెకె మహేందర్ రెడ్డి ఒకప్పుడు అత్యంత ముఖ్యమైన నాయకుడు. కెసిఆర్‌కు అత్యంత సన్నిహితమైన నేతగా గుర్తింపు పొందారు. సిరిసిల్ల నియోజకవర్గం సీటు కారణంగా తలెత్తిన వివాదంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. ఆయన వ్యక్తిగత ఆరోపణల విషయంలో వేలు పెట్టరు. రఘునందన్ రావు హరీష్ రావుపై ఆరోపణలు చేసినప్పుడు కూడా వ్యక్తిగతమైన ఆరోపణలకు ఆయన దూరంగా ఉన్నారు.

కొమ్మూరి ప్రతాప రెడ్డి తెరాస తరఫున పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. కెటిఆర్‌పై వచ్చిన ఆరోపణలను ఆయన ఏదో మేరకు బలపరిచారు.

నల్లగొండ జిల్లాకు చెందిన జిట్టా బాలకృష్ణా రెడ్డి కూడా ఒకప్పుడు కెసిఆర్‌కు అత్యంత సన్నిహితులు. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని పార్టీ నుంచి బయటకు వచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన కెసిఆర్ కుటుంబ సభ్యులపై వ్యక్తిగత ఆరోపణలకు దూరంగానే ఉంటున్నారు.

తెరాస ద్వారా మందాడి సత్యనారాయణ ఓసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. తెరాసలో ఆయనకు మంచి ప్రాధాన్యం ఉండేది. కానీ ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు. ఆయన కూడా కెటిఆర్‌పై ఆరోపణలకు మద్దతుగా మాట్లాడారు.

ఇక ప్రస్తుత కాంగ్రెసు శాసనసభ్యుడు జగ్గారెడ్డి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కెసిఆర్‌ను, కెసిఆర్ కుటుంబ సభ్యులను ఆయన లక్ష్యంగా చేసుకున్నారు. అవకాశం చిక్కితే ఆయన విరుచుకుపడుతుంటారు. తాజాగా కూడా ఆయన ధ్వజమెత్తారు. ఈయన తొలిసారి తెరాస ద్వారానే శానససభ్యుడిగా ఎన్నికయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెసు పార్టీలో చేరారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బలమైన మద్దతుదారుగా నిలుస్తున్నారు.

ఒకప్పుడు రఘునందనరావు తెరాసలో అత్యంత విశ్వసనీయమైన నాయకుడు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో సంబంధాలు నెరపుతున్నారనే కారణంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత ఆయన తోక తొక్కిన తాచులా లేస్తున్నారు.

ఇక కెసిఆర్ విషయానికి వస్తే - ఆరోపణలు, విమర్శలు ఎదుర్కోవడం ఆయనకు అలవాటుగా మారింది. వ్యూహరచనలో దిట్ట అయిన కెసిఆర్ తన కుమారుడు కెటిఆర్‌పై వచ్చిన ఆరోపణలను ఎలా ఎదుర్కుంటారనే ఆసక్తి నెలకొంది. తెలంగాణ భావోద్వేగం ఆయనకు వరంగా నిలుస్తోంది.












Click it and Unblock the Notifications