సూరజ్‌ను వెంటాడుతున్న జియా ఖాన్ మృతి కేసు
ముంబై: నటి జియా ఖాన్ మృతి కేసు సూరజ్ పంచోలీని, ఆయన కుటుంబ సభ్యులను వెంటాడుతోంది. సూరజ్ జ్యుడిషియల్ కస్టడీని జులై 11వ తేదీ వరకు పొడగిస్తూ అంథేరీ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. దిగువ కోర్టు తన బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చడాన్ని సూరజ్ పంచోలీ బొంబాయి హైకోర్టులో సవాల్ చేశాడు.
జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో 22 ఏళ్ల సూరజ్ పంచోలిని గురువారం అంథేరీ కోర్టులో హాజరు పరిచారు. పంచోలీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై బొంబాయి హైకోర్టు జులై 5వ తేదీన విచారణకు చేపట్టనుంది. బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలీ, జరీనా వాహబ్ కుమారుడైన సూరజ్ జియా ఖాన్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు.

జియా ఖాన్‌ను నిరంతరం వేధింపులకు గురి చేసినట్లు దర్యాప్తులో తేలింది. జియా ఖాన్ అబార్షన్ చేయించుకున్నట్లు కూడా తేలింది. జియా ఖాన్ రాసిన ఆరు పేజీల లేఖను పోలీసులు మరణ వాంగ్మూలంగా పరిగణిస్తున్నారు.
లేఖలో వేధింపులకు గురైనట్లు ఆరోపించిన తేదీ లేదని, ఆత్మహత్యకు సూరజ్ కారణమని కూడా లేదని సూరజ్ తరఫు న్యాయవాదులు అంటున్నారు. లేఖలోని రాత, సంతకం జియా ఖాన్ రాత, సంతకం లాగా కనిపించడం లేదని కూడా అంటున్నారు. జూన్ 3వ తేదీన జియా ఖాన్ తన నివాసంలో మరణించింది. ఉరేసుకుని జియా మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.












Click it and Unblock the Notifications