హైద్రాబాద్Vsతెలంగాణ: కెసిఆర్‌పై కాంగ్రెస్ 'నేమ్' గేమ్?
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని, ఇరుప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే వ్యూహంలో భాగంగా కాంగ్రెసు పార్టీ పెద్దలు రాయల తెలంగాణపై తర్జన భర్జన పడుతున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తాను తెలంగాణపై మాట ఇచ్చానని, దానిని ఎలా తప్పగలనని నేతలతో చెబుతున్నారట.
ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ సోనియా నిర్ణయమే ప్రకటనగా వెలువడే అవకాశముంది. ఇదే సమయంలో మరో విషయమై కూడా పార్టీలో ఢిల్లీ పెద్దల్లో చర్చ జరుగుతుందని అంటున్నారు. ఇరు ప్రాంతాల నేతలు రాయల తెలంగాణ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించిన పక్షంలో తెలంగాణకే మొగ్గు చూపాలనే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు.

హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ శాసన సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును దెబ్బతీసేందుకు కాంగ్రెసు పార్టీ వ్యూహాలు రచిస్తోందని అంటున్నారు. రాయల తెలంగాణతో మూడు పార్టీలను దెబ్బతీసే వ్యూహం ఉన్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 2014లో తమకు మద్దతిస్తే తెలంగాణపై ప్రకటన చేయడమే ఉత్తమమని భావిస్తున్నారట.
హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇస్తే కెసిఆర్‌ను దెబ్బతీసేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు, పలువురు ఢిల్లీ పెద్దలు 'హైదరాబాద్' పేరును తెరపైకి తీసుకు వస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ అంటే కెసిఆర్.. కెసిఆర్ అంటే తెలంగాణగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ ఇస్తే... కెసిఆర్‌ను దెబ్బతీసేందుకు కొత్త రాష్ట్రం పేరును తెలంగాణగా కాకుండా హైదరాబాదుగా ప్రకటించాలనే యోచనలో ఉన్నారని అంటున్నారు.
పేరులో మార్పు ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితిని చాలా దెబ్బతీయవచ్చునని, తెలంగాణ పేరుతోనే కొత్త రాష్ట్రమిస్తే తెరాస బాగా లాభపడుతుందని, అదే హైదరాబాద్ అనే పేరుతో రాష్ట్రం ఇస్తే దానిని తెలంగాణ ప్రజలు తెరాస క్రెడిట్‌గా చూసే అవకాశాలు తక్కువుంటాయని, అప్పుడు కాంగ్రెసు పార్టీ లాభపడటం ఖాయమని పలువురు రాష్ట్ర నేతలు ఢిల్లీ పెద్దలకు చెప్పారట.












Click it and Unblock the Notifications