సోనియాగాంధీ ఒప్పుకోరు: తెలంగాణపై సీమాంధ్ర నేతలు

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను తాము కోరామని మంత్రి శైలజానాథ్ ఆదివారం అన్నారు. తెలంగాణ విభజన పైన 2009 డిసెంబర్ 9న ప్రకటనే చివరది అన్నారు. సమైక్యవాదం బలంగా వినిపించిన ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావుకు కేబినెట్లో చోటు దక్కడం శుభపరిణామం అన్నారు.
తాము సోమవారం మినిస్టర్స్ క్వార్టర్సులో దిగ్విజయ్‌ని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతామని చెప్పారు. ఇందుకు సంబంధించి తాము ఓ మెమోరాండం సమర్పిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన జరగదని సంకేతాలు స్పష్టంగా ఉన్నాయని మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. తాము సమైక్యాంధ్ర తప్ప మరో ప్రత్యామ్నాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పారు.
రాష్ట్ర విభజనకు దివంగత ప్రధానమంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీలు ఒప్పుకోలేదన్నారు. అలాగే ప్రస్తుత పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ కూడా అంగీకరించరన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందిందని శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు.
కాగా, ఓ వైపు తెలంగాణకు అనుకూల సంకేతాలు వస్తుండటం, మరోవైపు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు తెలంగాణ సాధన సభను నిర్వహిస్తుండటంతో సీమాంధ్ర నేతల్లో కలవరం ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications