సిఎం కాన్వాయ్‌పై కూలిన చెట్టు, తప్పిన ప్రమాదం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ వాహనాల పైన శనివారం ఓ భారీ వృక్షం కూలింది. సచివాలయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో కొన్ని వాహనాలు దెబ్బతినగా, విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసుకు స్వల్పంగా గాయాలయ్యాయి. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని వాహనాలతో పాటు, సిఎస్ వాహనం దెబ్బతిన్నది.
ముఖ్యమంత్రి సచివాలయానికి చేరుకుని కార్యాలయంలోకి వెళ్లిన పది నిమిషాల్లోనే ఈ సంఘటన జరిగింది. దీంతో ప్రమాదం తప్పింది. ఉదయం 11.40 గంటలకు ముఖ్యమంత్రి సచివాలయానికి చేరుకున్నారు. సమతా బ్లాక్ వద్ద వాహన శ్రేణిని పార్క్ చేసిన సిబ్బంది కొందరు పక్కకు వెళ్లారు. మరికొందరు వాహనాల్లోనే ఉన్నారు.

11.50 గంటల సమయంలో భారీ వృక్షం నేలకూలింది. మొదట సెంట్రీ పోస్టుపై, ఆ తర్వాత వాహన శ్రేణిపై వృక్షం పడింది. వాహన శ్రేణిలోని జామర్, పైలట్ వాహనం స్వల్పంగా దెబ్బతినగా, అంబులెన్స్, సిఎస్ వాహనం ఎక్కువగా దెబ్బతిన్నాయి. సెంట్రీ పాయింట్ పూర్తిగా ధ్వంసమైంది.
సెంట్రీ పాయింట్‌లో విధులు నిర్వహిస్తున్న గార్డుకు దెబ్బలు తగలడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో సందర్శకులు, సిబ్బంది పరిసర ప్రాంతాల్లో లేకపోవడంతో కూడా ప్రమాదం తప్పినట్లైంది. ప్రస్తుతం కూలిన చెట్టు పక్కనే మరో బాదం చెట్టు ఒకవైపుకు వంగి ప్రమాదకరంగా ఉంది.












Click it and Unblock the Notifications