జగన్, కెసిఆర్ డోంట్‌కేర్: అసద్ 18, చిరుతో 5?(పిక్చర్స్)
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ రాయల తెలంగాణ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రాయల తెలంగాణతోనే వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలను దెబ్బతీసి ఇరు ప్రాంతాలలో ఎక్కువ స్థానాలను గెలుచుకోవచ్చునని కాంగ్రెసు పార్టీ భావిస్తోందట. ఇందుకోసం కాంగ్రెసు ఎన్నో లెక్కలు వేసుకున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో విభజనతో పాటు రెడ్డి, సీమాంధ్రలో కాపు సామాజిక వర్గం పరంగా లెక్కలు వేసుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అంతేకాదు రాయల తెలంగాణతో అక్కడ పద్దెనిమిది, సీమాంధ్రలో తక్కువలో తక్కువ ఐదు స్థానాలలో గెలుస్తామని కాంగ్రెసు భావిస్తోందట. తెరాస, ఇతర తెలంగాణవాదులు కోరుతున్న పది జిల్లాలను రాష్ట్రంగా ప్రకటించి ఊరుకుంటే సీమాంధ్రలో పార్టీకి చావుదెబ్బ తప్పదు. తెలంగాణలోను క్రెడిట్ తెరాస, బిజెపి తదితర పార్టీలకు వెళ్తాయి. ఈ కోణంలోనే కాంగ్రెసు రాయల తెలంగాణకు మొగ్గు చూపుతోందని అంటున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఇక్కడి నుండి 33 స్థానాలను గెలుపొందింది. విభజన జరిగాక అంతమొత్తంలో కాకపోయినా సాధ్యమైననన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలని చూస్తోంది. రాయల తెలంగాణ ప్రకటిస్తే మజ్లిస్ తమ వెంటే ఉంటుందని, అప్పుడు తెలంగాణలో కనీసం పద్దెనిమిది, పంతొమ్మిది స్థానాల్లో గెలుపొందవచ్చునని భావిస్తోందట. రాయల తెలంగాణ ప్రకటిస్తే 21 పార్లమెంటు స్థానాలు ఉంటాయి.

రాయల తెలంగాణ ఇస్తే రాయల ఆంధ్రలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తదితరుల సహాయంతో కాంగ్రెసు గట్టెక్కుతుందని భావిస్తున్నారట.

రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఇస్తే హైదరాబాదులో పట్టున్న మజ్లిస్ ద్వారా తమకు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధి చేకూరుతుందని భావిస్తోందని అంటున్నారు.

రాయల తెలంగాణ ప్రకటనతో ఇన్నాళ్లు తమకు సవాల్‌గా మారిన తెలంగాణ రాష్ట్ర సమితిని దెబ్బతీయవచ్చునని అధిష్టానం భావిస్తోంది. రాయల తెలంగాణ ఇస్తే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తెరాస ప్రభావం శూన్యం కాగా.. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఉన్న ఆ కొద్ది ప్రాధాన్యం తగ్గిపోతుందని భావిస్తున్నారట.

ఇన్నాళ్లు తమకు ముచ్చెమటలు పోయించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బలాన్ని రాయల తెలంగాణ ద్వారా దెబ్బతీయవచ్చునని అధిష్టానం భావిస్తోందంటున్నారు.

రాయల తెలంగాణ ద్వారా తెలుగుదేశం పార్టీని కూడా దెబ్బతీయవచ్చునని అధిష్టానం భావిస్తోందట. అయితే తమ పార్టీకి చెందిన నేతలను ఆకర్షిస్తూ.. తమ కేడర్‌ను దెబ్బతీస్తున్న జగన్, కెసిఆర్‌లే ప్రధాన లక్ష్యంగా అధిష్టానం ఈ ప్రతిపాదనపై మొగ్గుచూపుతోందంటున్నారు.
ఇక సీమాంధ్రలో ఉండే 21 స్థానాలలోను ఐదు నుండి ఎనిమిది స్థానాలలో గెలుస్తామని లెక్కలు వేసుకుందట. నేతల బలం, కాంగ్రెసు పార్టీ క్యాడర్ నేపథ్యంలో విభజన తర్వాత ఈ స్థానాలు వస్తాయని భావిస్తోందట. అప్పుడు 33 కాకపోయినా 25 స్థానాల్లో గెలుపొందటం ద్వారా కేంద్రంలో పట్టు సాధించవచ్చునని భావిస్తోందని అంటున్నారు.
జగన్, కెసిఆర్ డోంట్ కేర్
కాంగ్రెసు పార్టీ పలు సందర్భాలలో తెరాస విలీనంపై చర్చలు జరిపిందని, జగన్ మద్దతుపై కూడా చర్చలు జరిపిందనే వార్తలు గతంలో వినిపించాయి. వచ్చే ఎన్నికలలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కాంగ్రెసు ఆ పార్టీలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేశాయంటారు. అయితే రాయల తెలంగాణ ప్రకటనతో వారిని లెక్కలోకి తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.
ఇన్నాళ్లు తెలంగాణపై ఢిల్లీ నుండి తనకు సంకేతాలు ఉన్నాయని కెసిఆర్ పలు సందర్భాలలో చెప్పారు. కానీ ఇంత చర్చ సాగుతున్నా ఆయన మాత్రం పెదవి విప్పడం లేదు. ఆయనకు ఎలాంటి సంకేతాలు లేవని దీని ద్వారా అర్థమవుతోందని అంటున్నారు. ఇన్నాళ్లు కెసిఆర్‌తో చర్చలు జరిపిన అధిష్టానం రాయల తెలంగాణపై మాత్రం ఆయనను సంప్రదించలేదని అంటున్నారు. అదే సమయంలో జగన్‌ను కూడా ప్రస్తుతానికి పక్కకు పెట్టాలని చూస్తోందని అంటున్నారు.
తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై వ్యూహాత్మకం
రాయల తెలంగాణ ద్వారా తెరాసకు నాలుగు జిల్లాల్లో దాదాపు ఉనికి ఉండదనే అంటున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలో తెరాస లేదు. ఇక ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కొద్దిగా ప్రభావం ఉన్నా అది ఎన్నికల నాటికి కోల్పోతుందని అంటున్నారు. మిగిలిన ఎనిమిది జిల్లాల్లో విభజన జరిగినందు వల్ల పోటాపోటీ ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు రాయలసీమను విభజించడం ద్వారా జగన్ బలంగా ఉన్న ఆ ప్రాంతాన్ని ముక్కలు చేసినట్లవుతుందని, తద్వారా ఆ పార్టీని దెబ్బతీసినట్లవుతుందని భావిస్తున్నారని అంటున్నారు.
ఒకవేళ రాయలాంధ్రలో జగన్ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నా అది అధికారంలోకి వచ్చేంత ఉండదని భావిస్తున్నారట. అయితే ఇటీవల తెలుగుదేశం క్రమంగా బలపడుతుందని, అదే జరిగితే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి వంటి వారి వల్ల సీమాంధ్రలోను కాంగ్రెసు మంచి స్థానాలు గెలుచుకునే అవకాశాలు లేకపోలేదనే కోణంలోను ఆలోచిస్తోందట.












Click it and Unblock the Notifications