తెలంగాణపై 12న కోర్ కమిటీ భేటీ, పంచాయతీ అడ్డమా?

రెండు ప్రత్యామ్నాయాలకు అనుగుణంగా రోడ్ మ్యాప్ రూపొందించి కోర్ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వస్తారని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా దామోదర రాజనర్సింహ రోడ్ మ్యాప్‌ను తయారు చేయడంలో మునిగినట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెసు ఏ విధంగా విజయం సాధిస్తుందనే విషయంపై ఆయన దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయనే విషయాన్ని ఆయన వివరించే అవకాశాలున్నాయి. అలాగే, రెండు ప్రాంతాలు కూడా ఎలా అభివృద్ధి చెందుతాయనే విషయంపై ఆయన దృష్టి పెట్టినట్లు సమాచారం.
కాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇస్తారని తెలంగాణ నాయకులు బావిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టక ముందు ఆయన పలుమార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడారు. ఆ తర్వాత ఆయన విభజనపై చాలా తక్కువగా మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే తిరిగి తాను పార్టీని ఎలా అధికారంలోకి తెస్తానో చెప్పేందుకు వీలుంది.
ఇదిలావుంటే, పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి తెలంగాణపై ప్రకటనకు అవరోధంగా మారుతుందా అనే చర్చ జరుగుతోంది. అది ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందికి వస్తుందా రాదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణపై ప్రకటనను ఆపించడానికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పంచాయతీ ఎన్నికలకు హడావిడిగా రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అయితే, అదేమీ సమస్య కాదని తెలంగాణ నాయకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications