కాంగ్రెసులో విలీనం చేయం, నమ్మలేం: కెసిఆర్

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తే స్వాగతిస్తాం, సంతోషిస్తామని తెరాస నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. ఇంచార్జీల సమావేశానంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ ఏర్పడే వరకు రాష్ట్ర సాధన కోసం పనిచేస్తామని, తెలంగాణ ఏర్పడిన తర్వాత పునర్నిర్మాణం కోసం పనిచేస్తామని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తుందనే విషయంలో కేంద్రంపై, కాంగ్రెసుపై అనుమానంగానే ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించే వరకు తెలంగాణ ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వస్తున్న ఊహాగానాలకు తాము స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తమకు సమాచారం అందలేని ఎందుకు అనుకుంటున్నారని, సంకేతాలు అందలేదని ఎవరన్నారని ఆయన ప్రశ్నిస్తూ తమకు ఉండే సమాచారం తమకు ఉందని, అవసరమైనప్పుడు ఆ విషయాలను బయటపెడుతామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించి, పార్లమెంటులో తీర్మానాన్ని ప్రతిపాదించి, రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన చర్యలు కొనసాగిస్తేనే ప్రజలు నమ్ముతారని ఆయన అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెసు తెలంగాణపై కొత్త నాటకం ఆడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామాల్లోకి వెళ్లలేని స్థితిలో వెసులుబాటు కల్పించుకుని గ్రామాల్లోకి వెళ్లడానికి ఈ నాటకం ఆడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రజల్లో అయోమయం లేదని ఆయన అన్నారు. ప్రజలు కోరుకునే తెలంగాణ కావాలని తాము సమ్మతిస్తామని చెప్పారు. రాయల తెలంగాణ అంటారా, ప్యాకేజీ అంటారా అదో ఒక్క ప్రతిపాదనతో ముందుకు వస్తే మాట్లాడడానికి వీలుంటుందని ఆయన అన్నారు.
కాంగ్రెసుకు రావణాసురుడికి లాగా పది తలకాయలున్నాయని, ఒక్కో తలకాయ ఒక్కో మాట మాట్లాడుతుందని, కాంగ్రెసు పార్టీ చాలాసార్లు హామీలు ఇచ్చిందని ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదని కడియం అన్నారు. కాంగ్రెసుకు ఒక్క విధానం ఉందా, ఒక్క మాటను చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ తెలంగాణ సభ పెట్టుకోమన్నారు, సీమాంధ్ర నాయకులకు సభ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారని, వారు ఎవరి మీద సభ పెట్టుకుంటారని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications