కాంగ్రెసు లెక్కలు: తెలంగాణతో జగన్ బలహీనం?

ఇప్పటికే, తెలంగాణ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలహీనంగా ఉందని, జిల్లాల్లో సరైన నాయకత్వం లేదని అంటున్నారు. ముగ్గురు, నలుగురు ఉన్నా వారు జిల్లా అంతటికీ ప్రాతినిధ్యం వహించి జిల్లాను గుండగుత్తగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా మార్చే పరిస్థితి లేదని అంటున్నారు. వరంగల్‌లో కొండా సురేఖ దంపతులు గానీ, ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డి గానీ జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేయలేని స్థితిలో ఉన్నారంటే మిగతా జిల్లాల్లోని నాయకుల పరిస్థితి చెప్పనవసరం లేదని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇస్తే, కొద్ది మంది నాయకులు తిరిగి తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెసు అధిష్టానం అంచనా వేస్తోంది. కరీంనగర్ జిల్లాలో కెకె మహేందర్ రెడ్డి, నల్లగొండ జిల్లాలో జిట్టా బాలకృష్ణా రెడ్డి, నిజామాబాద్ జిల్లాలో బాజిరెడ్డి గోవర్దన్ వంటి నాయకులు తమ తమ జిల్లాల్లో పార్టీని ఇతర పార్టీలకు దీటుగా తయారు చేయగలరా అనేది సందేహమే.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోని తెలంగాణ నాయకుల్లో కూడా అంత ఉత్సాహం కనిపించడం లేదని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను ఢీకొని కార్యకర్తలను సమీకరించుకునే సత్తా కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లేదని అంటున్నారు. ఇటువంటి స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే జగన్‌ను తెలంగాణలో ఆదరించేవారు కూడా ఉండరని కాంగ్రెసు అంచనాలు వేస్తోంది.
తెలుగుదేశం పార్టీ కూడా చాలా బలహీనపడిన స్థితిలో తెరాసను విలీనం చేసుకోవడమా, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడమా అనే విషయాన్ని ఆలోచించుకోవచ్చునని అనుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ఇచ్చిన సంకేతాలతో తెరాసలోకి కూడా వలసలు పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కాంగ్రెసు నాయకులు గ్రామాల్లోకి వెళ్లి తెలంగాణను అధిష్టానం ఇస్తోంది, తాము తెస్తున్నాం అని చెప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications