అతను చేసేది కాంపౌండర్ ఉద్యోగం, కూడబెట్టింది కోట్లు
జైపూర్: ఓ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్న మహేష్ చంద్ర శర్మ అనే వ్యక్తి లంచాల వేటలో పడి కోట్లాది రూపాయలు కూడబెట్టాడు. విచిత్రమేమిటంటే, 2008లో అతనికి ప్రతిష్టాత్మకమైన ఫ్లోరెన్స్ నైటేంగిల్ ఆవార్డు కూడా వచ్చింది. రెండు నెలలుగా అతని కార్యకలాపాలపై కన్నేసిన అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) రెండు రోజుల క్రితం పట్టేసుకుంది. అతని ఇంట్లో జరిగిన సోదాల్లో దిమ్మతిరిగే ఆస్తుల వివరాలు బయటపడ్డాయి. రూ.100 కోట్లకు పైగా విలువైన ఆస్తులు అతనికి ఉన్నట్లు తేలింది.
అతను నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దిలీప్‌కుమార్‌కు సలహాదారుగా ఉన్నాడు. దాంతో అతను వక్రమార్గంలో పంట పండించుకున్నాడు. రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీలకు ఎలాంటి అనుమతులు కావాలన్నా ఈ కాంపౌండర్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఆ పదవిని అడ్డుపెట్టుకుని అతడు 2007 నుంచి పెద్ద యెత్తున ఆస్తులు కూడబెట్టాడు. ఏకంగా 25 నర్సింగ్ కాలేజీల్లో భాగస్వామిగా మారాడు.

తాజాగా మహేష్ చంద్ర ఓ కాలేజీలో సీట్ల సంఖ్యను పెంచడానికి రూ.5లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అనేక స్థలాలు, ఇళ్లు, ఫామ్‌హౌజ్, ఓ ఆసుపత్రి, రిసార్ట్, పలు కంపెనీలు అతని ఆస్తుల జాబితాలో ఉన్నాయి. ఇటీవలే రూ. 22 కోట్లు పెట్టి జైపూర్‌లో ఓ విలాసవంతమైన ఇల్లు కూడా కొన్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో ఎన్‌సీఐ చీఫ్ పాత్ర కూడా ఉందని ఎసిబి తేల్చింది.
ఇద్దరూ కూడబలుక్కొని నర్సింగ్ కాలేజీల నుంచి ఇష్టారాజ్యంగా లంచాలు వసూలు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో పలు నర్సింగ్ కాలేజీల కార్యాలయాలపైనా ఎసిబి దాడులు నిర్వహించి పలు రికార్డులు స్వాధీనం చేసుకుంది.












Click it and Unblock the Notifications