పార్టీదే ఆలస్యం, ప్రభుత్వం రెడీ: తెలంగాణపై షిండే

మంగళవారం కేంద్ర హోంశాఖకు చెందిన పార్లమెంట్ సభ్యుల సంప్రదింపుల కమిటీ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్‌తో షిండే ఈ విషయం చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రాన్ని విభజించాలా లేదా అన్నది రాజకీయ నిర్ణయమని ఈ నిర్ణయం త్వరలో వస్తుందని ఆశిస్తున్నామని షిండే చెప్పినట్లు సమాచారం.
శ్రీకృష్ణ కమిటీ చేసిన ఆరు సిఫారసులతో పాటు రాయల తెలంగాణ ప్రతిపాదన పై కూడా తన శాఖ రహస్యంగా కసరత్తు చేసినట్లు చెప్పారని తెలుస్తోంది. అధిష్ఠానం తెలంగాణపై పదిరోజుల్లోపు నిర్ణయం తీసుకుంటుందని, ఆ తర్వాత ప్రభుత్వం రంగంలోకి దిగుతుందని ఆయన ఖాన్‌కు చెప్పినట్లు తెలిసింది.
పదిరోజుల్లోనే కోర్‌కమిటీ సమావేశం జరుగుతుందని, ఈ సమావేశానికి సోనియా, రాహుల్ హాజరవుతారని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి , పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కూడా ఆహ్వానిస్తారని షిండే చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ హైదరాబాదులో చెప్పారు. అయితే, విభజించాలా, సమైక్యంగా ఉంచాలా అనే రెండు ప్రతిపాదనలు మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications