బుద్దగయలో వరుస బాంబు పేలుళ్లు: మక్బూల్ హస్తం?
పాట్నా: ప్రసిద్ధ బుద్దగయలోని మహాబోధి ఆలయం వద్ద ఆదివారం ఉదయం వరుస పేలుళ్లు సంభవించాయి. ఉదయం ఐదు గంటల సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి. స్వల్ప వ్యవధిలోనే తొమ్మిది పెలుళ్లు జరిగాయి. మహాబోధి ఆలయం వద్ద జరిగిన ఈ వరుస పేలుళ్లలో ఐదుగురికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి దేవాలయ ప్రాంగణం దెబ్బతిన్నది.
ఆలయం వెలుపల పేలకుండా ఉన్న మరో రెండు బాంబులను భద్రతా సిబ్బంది గుర్తించింది. దానిని నిర్వీర్యం చేశారు. పేలుడులో గాయపడ్డ వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. పేలుడు ప్రాంతాన్ని ఫోరెన్సిక్ నిపుణులు, సహాయ సిబ్బంది పరిశీలిస్తున్నారు. సిఆర్పీఎఫ్, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

ఈ పేలుళ్లలో ఐదుగురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. మహాబోధి ఆలయం లోపలే మూడు పేలుళ్లు జరిగాయని పలువురు చెబుతున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బోదగయలో పేలుళ్లకు తీవ్రవాదులు వ్యూహాలు పన్నుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు ముందే హెచ్చరించినా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందంటున్నారు. పేలుళ్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అత్యవసర సమావేశమయ్యారు.
బుద్ధగయలో పేలుళ్లు ఉగ్రవాదుల పనేనని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ రోజు ఉదయం ఐదుంపావుకు మొదటి పేలుడు జరిగిందన్నారు. పేలుళ్లు ఇండియన్ ముజాహిదీన్ పనేనని తెలుస్తోంది.
ఖండన
బుద్దగయలోని పేలుళ్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తదితరులు ఖండించారు. పరిస్థితులను సమీక్షించేందుకు బీహార్ బిజెపి ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
మరోవైపు బుద్ధగయలో జరిగిన వరుస బాంబు పేలుళ్లపై శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆలయ నిర్వాహకులతో ఆయన మాట్లాడారని, పూర్తి వివరాలను తనకు తెలియజేయవలసిందిగా విదేశాంగ శాఖ, శ్రీలంక హై కమిషన్‌లకు చెందిన అధికారులను కోరానని అధ్యక్షుని కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
సయ్యద్ మక్బూల్ హస్తం?
బుద్దగయ పేలుళ్ల వెనుక సయ్యద్ మక్బూల్ హస్తం ఉండవచ్చునని విచారణ ఎన్ఐఏ అనుమానిస్తోంది. సయ్యద్ మక్బూల్ ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు పేలుళ్ల వెనుక కూడా ఆయన హస్తముందని అనుమానిస్తున్నారు. అతనిని కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలని చూస్తున్నారు.












Click it and Unblock the Notifications