రాజధానిలో కూలిన సిటీ లైట్ హోటల్, 13 మంది మృతి
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సోమవారం ఉదయం ఓ హోటల్ కుప్పకూలిన ఘటనలో 13 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్రపతి రోడ్డులోని సిటీ లైట్ హోటల్ భవనం ఈ రోజు ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
భవనం కూలిన సమయంలో అందులో డెబ్బై మంది వరకు ఉంటారని భావిస్తున్నారు. వెంటనే స్పందించిన స్థానికులు పలువురిని రక్షించారు. విషయం తెలియగానే పోలీసు యంత్రాంగం, జిహెచ్ఎంసి సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు.
సహాయ సిబ్బంది పలువురిని వెలికితీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుప్పకూలిన భవనంలో రెండంతస్తులు ఉన్నాయి. కాలం చెల్లిన భవనం కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఆరు ప్రొక్లయిన్లతో శిథిలాల తొలగింపు ముమ్మరంగా కొనసాగుతోంది.

హోటల్ గదిలో పదుల సంఖ్యలో కస్టమర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హోటల్ వర్కర్లు కూడా గాయపడ్డారు. నిత్యం రద్దీగా ఉండే హోటల్ కావడంతో ఎక్కువమంది గాయపడ్డారని చెబుతున్నారు. కాగా భారీ ట్రాఫిక్ జాం కావడంతో ఆర్పీ రోడ్డు, రాణిగంజ్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు
ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. అందులో సంతోష్, రాజీవ్, మురళీ, మనోజ్, నన్ను, రమేష్‌లు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరికొందరిని గుర్తించాల్సి ఉంది. మృతుల్లో నలుగురు హోటల్ సిబ్బంది ఉన్నారు.
ఈ భవనం ప్రమాదకరంగా కనిపించలేదని, ఎందుకు కూలిందో తెలియని, విచారణలో అంతా తేలుతుందని జిహెచ్ఎంసి కమిషనర్ కృష్ణబాబు అన్నారు. భవనం కూలిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు గీతారెడ్డి, దానం నాగేందర్, ముఖేష్ గౌడ్‌లు పరిశీలించారు. ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications